Karnataka Minister CID Investigation : కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి చెలువరాయస్వామిపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసును సీఐడీకి అప్పగించింది అక్కడి ప్రభుత్వం. స్వయంగా ఆ రాష్ట్ర మంత్రే.. లంచం కోసం వ్యవసాయశాఖ అధికారులను వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే సంబంధిత లేఖ నకిలీదని తొలుత కొట్టిపారేసిన ప్రభుత్వమే.. తాజాగా మంత్రిపై సీఐడీ విచారణకు ఆదేశించడం గమనార్హం.
Karnataka Agriculture Minister CID Case : ఈ లంచం ఆరోపణల వ్యవహారాన్ని కొందరు ఉన్నతాధికారులు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రిపై ఫిర్యాదు చేస్తూ ఆయనకు ఓ లేఖ కూడా రాశారు. వ్యవసాయశాఖకు చెందిన జాయింట్ డైరెక్టర్లు తనకు ప్రతినెలా రూ.6 నుంచి రూ.8లక్షల చొప్పున లంచం ఇవ్వాలని ఆ శాఖ ఉద్యోగులను మంత్రి చెలువరాయస్వామి కోరినట్లుగా ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై మండ్య జిల్లా వ్యవసాయశాఖకు చెందిన ఏడుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తూ రాసినట్లు ఉన్న ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఇలాంటి అవినీతి సంప్రదాయాన్ని నియంత్రించకుంటే తమ కుటుంబాలతో కలిసి ఆత్మహత్యలు చేసుకుంటామని బాధితులు హెచ్చరించినట్లుగా ఆ లేఖలో రాసి ఉంది. కాగా, ఆ లేఖను చీఫ్ సెక్రటరీ వందితా శర్మకు పంపించిన గవర్నర్.. దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకోవాలని సూచించారనే వార్తలు గుప్పుమన్నాయి.