కర్ణాటకలో ఓ వ్యక్తి 187 నాణెలను మింగాడు. అతడికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసిన వైద్యులు కడుపులో నుంచి వాటిని తొలగించి.. పునర్జన్మ అందించారు. అతడు గత కొన్నాళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తాయని వైద్యులు తెలిపారు.
ఒకటి.. రెండు కాదు.. ఏకంగా 187 నాణెలను మింగిన వ్యక్తి! - ద్యామప్ప హరిజన్ లేటెస్ట్ న్యూస్
ఎక్కడైనా సరే చిన్నపిల్లలు పొరపాటున ఒకటి లేదా రెండు నాణెలను మింగారన్న వార్తలను విని ఉంటాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా 187 నాణెలను మింగాడు. వైద్య చరిత్రలోనే ఇది చాలా అరుదైన కేసు అని అతడికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు తెలిపారు.
బాగల్‌కోట జిల్లాలో 58 ఏళ్ల ద్యామప్ప హరిజన్‌కు మతిస్థిమితం సరిగా లేదు. ద్యామప్ప తరచూ మద్యం తాగేవాడని.. తనకి తెలియకుండానే ఒకటి, రెండు, ఐదు రూపాయల నాణెలను మింగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఒకరోజు ద్యామప్పకు కడుపునొప్పి రావడం వల్ల అతడి కుటుంబ సభ్యులు బాగల్‌కోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అతడికి ఎండోస్కోపీ చేసిన వైద్యులు పొట్టలో ఉన్న నాణెలను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో వెంటనే శస్త్రచికిత్స చేసి ద్యామప్ప పొట్ట నుంచి 187 నాణెలను తొలగించారు. వాటిలో 56 రూ.5 నాణెలు, 51 రూ.2 నాణెలు , 80 రూ.1 నాణెలు ఉన్నాయి. నాణెల బరువు సుమారు 1.2 కిలోలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నాణెలు పేగుల్లోకి కాకుండా నేరుగా పొట్టలోకి వెళ్లడం వల్ల.. ఎలాంటి ప్రమాదం జరగలేదని వైద్యులు వెల్లడించారు. గ్యాస్ట్రోటమీ అనే శస్త్రచికిత్స ద్వారా ఈ నాణెెలను వెలికితీసినట్లు వైద్యులు తెలిపారు.