సాధారణంగా విమానం రనవే మీదుగా గాల్లోకి ఎగురుతుంది. కానీ ఇప్పుడు చూడబోయే విమానం సముద్రం లేదా నది ఉపరితలంపైనుంచే నేరుగా గాల్లోకి దూసుకెళ్లగలదు. ఈ వినూత్న విమానం పేరు సీప్లేన్. దేశ మొట్టమొదటి సీప్లేన్‌ను ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్‌లో ప్రారంభించారు. నర్మదానదిపై తేలియాడి, ఆకాశంలోకి ఎగిరింది ఈ విమానం. దాన్ని ఆదర్శంగా తీసుకుని, కర్ణాటకలోని ఉడుపికి చెందిన పుష్పరాజ్ మైక్రో లైట్ సీప్లేన్ రూపొందించాడు.
ఎయిర్ మోడలింగ్‌గా, ఎన్‌సీసీ శిక్షకుడిగా పనిచేశాను. రిమోట్‌తో కంట్రోల్‌డ్ యూఐవీ విమానం అభివృద్ధి చేశాను. నిజమైన విమానం తయారుచేయాలన్న కల చిన్నప్పటినుంచీ ఉండేది నాకు. కానీ నాకు అనుమతి దొరకలేదు. అందుకే సీప్లేన్ తయారుచేయాలని నిర్ణయించుకున్నా.
--పుష్పరాజ్ అమిన్, సీప్లేన్ ఆవిష్కర్త.
ఈ మైక్రోలైట్ సీప్లేన్ తయారుచేసేందుకు 15 ఏళ్లు శ్రమించాడు పుష్పరాజ్. ధృతి అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో.. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యార్థులతో చేతులు కలిపి, ఈ ప్రాజెక్టు పూర్తిచేశాడు. నీటిపై తేలుతూ, అక్కడినుంచే గాల్లోకి ఎగరగలదు ఈ విమానం. దీంట్లో ప్రస్తుతానికి పైలట్ మాత్రమే ఎక్కగలడు. త్వరలోనే ఏడుగురు కూర్చోగలిగే సీప్లేన్‌ను తయారుచేయాలని కలలు గంటున్నాడు పుష్పరాజ్.
4, 6 లేదా 10 సీట్లతో సీప్లేన్ తయారుచేస్తే, సులభంగా వినియోగించుకోవచ్చు. ఇది ఓ పడవ లాగా కూడా పనిచేస్తుంది. నీటిపైనుంచి కూడా టేకాఫ్ అవగలదు. చోటు అవసరం కూడా పెద్దగా ఉండదు. ప్రయాణాలకు, రక్షణ విభాగంలో, పర్యాటకం కోసం కూడా వినియోగించుకోవచ్చు.