కర్ణాటకతో సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర అసెంబ్లీ కీలక తీర్మానం ఆమోదించింది. కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్న 865 గ్రామాలను మహారాష్ట్రలో కలిపేందుకు న్యాయపరంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే స్వయంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సరిహద్దు వివాదాన్ని మరింత రాజేసేందుకే కర్ణాటక అసెంబ్లీ ముందుగా ఈ విషయంపై తీర్మానం ఆమోదించిందని శిందే ఆరోపించారు.
"కర్ణాటకలో ఉన్న 865 గ్రామాల్లోని మరాఠీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా నిలబడుతుంది. బెళగావి, కర్వాడ్, నిపాని, బీదర్, భాల్కి పట్టణాలు, 865 గ్రామాల్లోని ప్రతి అంగుళం భూభాగాన్ని మహారాష్ట్రలో కలపాలని న్యాయపరంగా సుప్రీంకోర్టులో పోరాడతాం. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేంత వరకు ఈ వివాదాన్ని పెద్దది చేయొద్దని మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినప్పుడు నిర్ణయించారు. కానీ, కర్ణాటక ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదించింది."
-మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం
అసెంబ్లీలో మాట్లాడుతున్న శిందే 'కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చండి'
865 గ్రామాలను కేంద్రపాలిత ప్రాంతాలు(యూటీ)గా ప్రకటించాలని శివసేన(ఉద్ధవ్) పార్టీ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు వాటిని యూటీలుగా పరిగణించాలని పేర్కొంది. అయితే, ఈ ప్రతిపాదనను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ తోసిపుచ్చారు. సరిహద్దు వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున.. కోర్టు ధిక్కార వ్యాఖ్యలు చేయకూడదని అసెంబ్లీలో పేర్కొన్నారు.
కాగా, సరిహద్దు వివాదం మహారాష్ట్ర రాజేసిన అంశమే అని పేర్కొంటూ కర్ణాటక అసెంబ్లీ గత గురువారం ఏకగ్రీవంగా తీర్మానించింది. రాష్ట్రంలోని అంగుళం భూమి కూడా మహారాష్ట్రకు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఇది ఇరు రాష్ట్రాల మధ్య తీవ్రమైన మాటల యుద్ధానికి దారితీసింది. పార్టీలకు అతీతంగా తమ రాష్ట్రాల తరఫున వాదనలు వినిపిస్తున్నారు రాజకీయ నేతలు.
1957 నుంచి ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన చేసిన సమయంలో బెళగావి ప్రాంతం కర్ణాటకలో విలీనమైంది. అంతకుముందు ఈ ప్రాంతం బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది. ఇక్కడ మరాఠీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నారని, ఈ నేపథ్యంలో వాటిని తమ రాష్ట్రంలో కలిపేయాలని మహారాష్ట్ర డిమాండ్ చేస్తోంది. కర్ణాటక మాత్రం.. రాష్ట్రాల పునర్విభజన చట్టం, 1967 మహాజన్ కమిషన్ నివేదికలను ప్రామాణికంగా భావిస్తోంది.