తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అఫిడవిట్లు ముందుగా జర్నలిస్టులకా?'.. మీడియాపై సీజేఐ కీలక వ్యాఖ్యలు

CJI NV RAMANA ON JOURNALISM: అఫిడవిట్లు న్యాయమూర్తుల కంటే మీడియాకే ముందుగా లభిస్తున్నాయని సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ అన్నారు. వాటిని జర్నలిస్టులకు ఇచ్చే ముందే.. న్యాయస్థానంలో సమర్పించాలని సూచించారు. కర్ణాటక నుంచి ఇనుప ఖనిజం ఎగుమతులకు అనుమతి మంజూరుపై విచారణ జరిపిన ఆయన.. పరిశోధనాత్మక పాత్రికేయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

CJI NV RAMANA ON JOURNALISM
CJI NV RAMANA KARNATAKA IRON ORE

By

Published : Apr 12, 2022, 7:46 AM IST

CJI NV RAMANA ON JOURNALISM: అఫిడవిట్లు తమకు చేరకముందే మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇవ్వకముందే వాటిని న్యాయస్థానంలో సమర్పించాలని ఆయన సూచించారు. కర్ణాటక నుంచి ఇనుప ఖనిజం ఎగుమతులకు అనుమతులు మంజూరు చేయాలన్న పిటిషన్లపై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని బళ్లారి, చిత్రదుర్గ, తమకూరు జిల్లాల నుంచి ఇనుప ఖనిజం ఎగుమతిని నిలిపివేయాలంటూ 'సమాజ్‌ పరివర్తన్‌ సముదాయ' అనే స్వచ్ఛంద సంస్థ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో- పర్యావరణ పరిరక్షణ, ఖనిజ వనరులను భావితరాలకు అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ మూడు జిల్లాల నుంచి ఉక్కు ఖనిజం ఎగుమతులను సుప్రీంకోర్టు 2012లో నిలిపివేసింది.

అయితే, ఈ ఎగుమతుల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ (సీఈసీ)లు అనుకూలంగా ఉన్నాయని, ఇందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేయాలంటూ పలు మైనింగ్‌ సంస్థలు సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించాయి. ఈ అంశంపై జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమా కోహ్లీల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఆయా సంస్థల తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గి, దుష్యంత్‌ దవే, రాకేశ్‌ ద్వివేది, కృష్ణన్‌ వేణుగోపాల్‌లు వాదనలు వినిపించారు. కర్ణాటకలోని మూడు జిల్లాల్లో మినహా దేశంలో మరెక్కడా ఇనుప ఖనిజం ఎగుమతులపై నిషేధం లేదని, దీంతో ఇక్కడి గనుల సంస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... దేశీయ మార్కెట్‌లో సరిపడినంత ఉక్కు అందుబాటులో ఉందా? ఇనుప ఖనిజం ఎగుమతికి అనుమతులు మంజూరు చేయవచ్చా? అన్నది తమకు తెలియజేయాలంటూ కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖను ఆదేశించింది.

పరిశోధనాత్మక పాత్రికేయం కనుమరుగవుతోంది:జస్టిస్‌ ఎన్‌.వి.రమణ... కేంద్రం తరఫున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కె.ఎం.నటరాజ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అఫిడవిట్లను మీడియాలోనే చదువుతున్నాం. ఈరోజు నాకు కోర్టులో అఫిడవిట్లు అందాయి. కానీ, అవి ముందురోజే మీడియాలో వచ్చినట్టు మా ప్రజాసంబంధాల అధికారి చెప్పారు. తొలుత జర్నలిస్టుగా పనిచేసిన నేను... ప్రస్తుత మీడియాపై కొన్ని ఆలోచనలు పంచుకోవడానికి స్వేచ్ఛ తీసుకుంటున్నాను. పరిశోధనాత్మక జర్నలిజం అన్నది ఇప్పుడు దురదృష్టవశాత్తూ మీడియా కాన్వాసు నుంచి కనుమరుగవుతోంది. కనీసం భారత్‌లో చూసినా ఇది నిజమేనని అనిపిస్తుంది. దయచేసి.. మీడియాకూ, పాత్రికేయులకూ అందజేయడానికి ముందే అఫిడవిట్లను న్యాయస్థానానికి సమర్పించండి" అని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. ఇందుకు నటరాజన్‌ బదులిస్తూ- కేంద్రం నుంచి అలా జరగదని చెప్పారు.

ప్రభుత్వ స్పందన కూడా తెలుసుకోవాలి...: 'సమాజ్‌ పరివర్తన్‌ సముదాయ' తరఫున ప్రముఖ సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపిస్తూ- ఇనుప ఖనిజం ఎగుమతికి సీఈసీ అనుకూలంగా ఉన్నప్పటికీ, ఎగుమతుదారులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తరచూ మాట్లాడినందున... ఆ ప్రభుత్వ స్పందన కూడా తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఒకవేళ ఎగుమతులు చేపట్టాలని నిర్ణయిస్తే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.సంతోష్‌ హగ్డే నేతృత్వంలో దాన్ని పర్యవేక్షించాలని సూచించారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ- కర్ణాటకలో ఇనుప ఖనిజం ఎగుమతులకు అనుమతి ఇవ్వాలా వద్దా? అన్న అంశానికంటే ముందే... అక్కడ ఇప్పటికే వెలికితీసిన ఖనిజాన్ని ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అన్న విషయాన్ని నిర్ణయిస్తామని తెలిపింది.

ఇదీ చదవండి:'ఉక్రెయిన్​కు భారత్​ సాయంపై బైడెన్ ప్రశంసలు'

ABOUT THE AUTHOR

...view details