తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐఏఎస్​ల మధ్య రగడ- ప్రభుత్వ కుట్రేనా? - కర్ణాటక ఐఏఎస్ సంవాదం

ఐఏఎస్ అధికారి దాసరి రోహిణీ సింధూరికి.. మరో ఐఏఎస్ అధికారి శిల్పా నాగ్​ మధ్య ముదిరిన వివాదం కర్ణాటకలో చర్చనీయాశంగా మారింది. వీరి విభేదాలు బదిలీల వరకు వెళ్లాయి. శిల్పా నాగ్ వెనక ప్రభుత్వ పెద్దలే ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ గొడవ ఏంటి? ఇద్దరి మధ్య విభేదాలు ఎలా మొదలయ్యాయి?

dasari sindhuri shilpa nag spat
దాసరి సింధూరి, శిల్పా నాగ్

By

Published : Jun 8, 2021, 3:48 PM IST

కర్ణాటకలో ఇద్దరు మహిళా ఐఏఎస్​ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మైసూరు సిటీ కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్, మైసూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ దాసరి రోహిణీ సింధూరి మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలు బదిలీల వరకు వెళ్లాయి. ప్రభుత్వం ఇద్దరిపై చర్యలు తీసుకున్నా.. గత కొద్ది రోజులుగా ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

అసలేమైందంటే?

దాసరి రోహిణి సింధూరి తనను ప్రతి విషయంలో అవమానపరిచేలా ప్రవర్తిస్తున్నారంటూ శిల్పా నాగ్ ఆరోపణలు చేశారు. తనను విధులు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. జిల్లా యంత్రాంగం తనకు సహకరించడం లేదని పేర్కొన్నారు. పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

సింధూరి- శిల్పా నాగ్(కుడి)

"ఓ ఐఏఎస్ అధికారి హోదాలో మరో అధికారిని సింధూరి అణచివేస్తున్నారు. ఆమె నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె మనస్తత్వం సరిగ్గా లేదు. తను మైసూరులో ఉండాల్సింది కాదు. ఆమె నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారో తెలీదు. నేను రాజీనామా చేసి వేరే జీవితాన్ని ఆస్వాదిస్తాను."

-శిల్పా నాగ్, ఎంసీసీ కమిషనర్

సింధూరి వివరణ

అయితే, తనపై వచ్చిన ఆరోపణలను సింధూరి ఖండిస్తున్నారు. శిల్పా నాగ్ వ్యాఖ్యలు వాస్తవ దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. పది రోజుల నుంచి జిల్లా యంత్రాంగానికి వ్యతిరేకంగా శిల్పా నాగ్.. ప్రెస్ స్టేట్​మెంట్లు ఇస్తున్నారని చెప్పారు. అలాంటి వైఖరి ఎంసీసీ కమిషనర్ స్థాయి వ్యక్తి నుంచి ఊహించలేదని అన్నారు. తను నిర్వహించే కరోనా సమీక్ష సమావేశాలకు సైతం శిల్ప హాజరు కావడం లేదని తెలిపారు.

దాసరి రోహిణీ సింధూరి

"కొత్త కరోనా కేసులకు సంబంధించి వార్డులు వారీగా ఎంసీసీ సమర్పించే వివరాలు అసంబద్ధంగా ఉన్నాయి. సంతకం లేకుండానే ఈ నివేదిక పంపిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని నేను ఆదేశించాను. ప్రైవేటు పరిశ్రమల నుంచి వచ్చే సీఎస్​ఆర్ ఫండ్స్​కు ఎంసీసీ కమిషనర్ ఇంఛార్జిగా ఉన్నారు. ఈ నిధులు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సంబంధించినవి. కానీ వీటిని ఒక్క మైసూరు నగరానికే వినియోగించారని నా దృష్టికి వచ్చింది. తాలుకాలు, గ్రామీణ ప్రాంతాలకు నిధులు అందించనేలేదు. ఇది సరైనది కాదు. దీనికి సంబంధించి జూన్ 1 వరకు ఉన్న వివరాలను ఇవ్వాలని ఆమెను అడిగాను. ఇలాంటి చర్యలు ఎలా వేధింపులకు గురిచేసినట్లు అవుతాయి? ఎలా ఊహించుకున్నా.. ఇవి ఆ కోవలోకి రావు."

-దాసరి రోహిణీ సింధూరి, జిల్లా డిప్యూటీ కమిషనర్

ఇద్దరి మధ్య ముదిరిన వివాదం కాస్తా.. బదిలీల వరకు వెళ్లింది. సింధూరి, శిల్పను ట్రాన్స్​ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింధూరిని 'హిందూ మత, స్వచ్ఛంద ఎండోమెంట్స్​' కమిషనర్​గా నియమించింది. మరోవైపు, శిల్పా నాగ్​ను పంచాయతీ రాజ్ శాఖలోని 'ఈ-గవర్నెన్స్'కు డైరెక్టర్​గా బదిలీ చేసింది.

సర్కారే ఎగదోసిందా?

అయితే, శిల్పా నాగ్​ను ప్రభుత్వంలోని నేతలే ఎగదోసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా డిప్యూటీ కమిషర్​ దాసరి సింధూరిని ఎదిరించాలని నేతలు ప్రోత్సహించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బదిలీ అనంతరం సింధూరి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. కొందరు వ్యక్తులు తనపై కుట్ర పన్నారని సింధూరి ఆరోపించారు. ఈ బదిలీ.. నిజాయితీ గల అధికారిగా తనకు లభించిన బహుమతి అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులపై పరోక్ష విమర్శలు చేశారు. డిప్యూటీ కమిషనర్​గా తాను విధులు నిర్వర్తించకుండా కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ల్యాండ్ మాఫియా నుంచి కాపాడేందుకు యత్నించిన తనపై కొందరు నిఘా వేసి ఉంచుతున్నారని చెప్పారు.

"కొందరు వ్యక్తులు అనవసరంగా నాకు ఇబ్బందులు కలిగించారు. ప్రభుత్వ భూముల ఆక్రమలను అడ్డుకునేందుకు నేను ప్రయత్నించాను. ఈ భూములు కాపాడటం డిప్యూటీ కమిషనర్​గా నా ప్రాథమిక బాధ్యత. నేను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సక్రమంగా పనిచేస్తున్నాను. దాన్ని కొందరు తప్పుగా చూస్తున్నారు. కుట్రకు నేను బాధితురాలిగా మారాను."

-దాసరి రోహిణీ సింధూరి, జిల్లా డిప్యూటీ కమిషనర్

అయితే శిల్పా నాగ్ వెనక ప్రభుత్వ నేతలు ఉన్నారన్న ఆరోపణలను మంత్రి సోమశేఖర్ కొట్టిపారేశారు. కరోనా నియంత్రణపైనే ప్రస్తుతం తాము దృష్టిసారించామని చెప్పారు. ఇలాంటి వివాదాల గురించి ఆలోచించే సమయం లేదని చెప్పుకొచ్చారు.

సింధూరి 2009 బ్యాచ్​కు చెందిన ఐఏఎస్ అధికారి. స్వస్థలం ఆంధ్రప్రదేశ్. శిల్పా నాగ్ 2014 బ్యాచ్​కు చెందిన అధికారి.

ఇదీ చదవండి:లక్షద్వీప్​లో రాజకీయ రగడ- అసలేం జరుగుతోంది?

ABOUT THE AUTHOR

...view details