Karnataka Hijab row: కర్ణాటకలో హిజాబ్ వివాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. హిజాబ్ నిబంధన అనేక విద్యాసంస్థల్లో ఉద్రిక్తతలకు దారి తీసింది. పరిస్థితి చేయి దాటిపోవడం వల్ల సెలవులు ప్రకటించాల్సిన గత్యంతరం ఏర్పడింది. విద్యా సంస్థలను మూడు రోజులు మూసేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశాలు జారీ చేశారు. అందరూ సంయమనం పాటించాలని ట్వీట్ చేశారు.
hijab controversy high court
మరోవైపు, అంశంపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగింది. ఉడుపి ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కళాశాల విద్యార్థినులు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. శాంతియుతంగా ఉండాలని ప్రజలు, విద్యార్థులకు సూచించింది. కొందరు చెడ్డ వ్యక్తులే సమస్యను మరింత తీవ్రం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం మంచిది కాదని పేర్కొంది. తదుపరి విచారణ సోమవారం మధ్యాహ్నం 2.30కి వాయిదా వేసింది.
Hijab issue in karnataka
ఆజ్యం పోసుకున్న ఘర్షణలు
కాగా, అనేక విద్యా సంస్థల్లో హిజాబ్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. హిజాబ్ ధరించి వచ్చిన వారిని అడ్డుకోవడంపై మహిళలు అభ్యంతరం చెప్పగా.. వారిని అనుమతించిన కళాశాలలో ఇతర విద్యార్థులు కాషాయ కండువాలు కప్పుకొని రావడం వివాదాస్పదమైంది.
hijab issue in karnataka
శివమొగ్గలోని ప్రభుత్వ డిగ్రీ కళాళాల వద్ద ఇరు వర్గాల విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్పీ కూడా పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లారు. కాషాయ శాలువాలు ధరించి వచ్చిన విద్యార్థులను కాలేజ్లోకి అనుమతించకపోవడం వల్ల వారు బయట నిరనసన చేపట్టారని, అనంతరం మరో వర్గం విద్యార్థులు అక్కడకు రావడం హింసకు దారితీసిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
144 సెక్షన్
బాపూజీ నగర్ ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కళాశాల పరిధిలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. హిజాబ్ ధరించిన విద్యార్థులకు, కాషాయ కండువాలు ధరించిన వారికి మధ్య మాటల యుద్ధంతో ప్రారంభమైన ఘర్షణ.. చివరకు రాళ్లు రువ్వుకునే స్థాయికి చేరుకుందని పోలీసులు తెలిపారు. ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారని వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో శివమొగ్గలో 144 సెక్షన్ విధించారు.