Karnataka Hijab Controversy: కర్ణాటకలో హిజాబ్ ధరించి వస్తున్న ముస్లిం యువతులను కళాశాల సిబ్బంది గేటు వద్దే అడ్డగించిన ఘటన సంచలనం రేపుతోంది. ఉడిపిలోని కుందాపూర్‌లోని ఓ కళాశాల విద్యార్థినులు హిజాబ్ ధరించి కాలేజీకి వచ్చారు. విద్యార్థినులు కళాశాల గేటు వద్దే అడ్డుకున్న సిబ్బంది.. ప్రభుత్వం జారీ చేసిన డ్రెస్‌కోడ్ ప్రకారం హిజాబ్‌లు ధరించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కళాశాల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎంతకీ లోపలికి అనుమతించకపోవడంతో అక్కడే ఆందోళనకు దిగారు.
పాఠశాల ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థినులు హిజాబ్ ధరించిన విద్యార్ధినులు కళాశాలలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సందర్భంలో కొంతమంది హిందు విద్యార్థులు కాషాయ శాలువాలు ధరించి ఆందోళనకు దిగారు. హిజాబ్‌కు అనుమతిస్తే కాషాయ శాలువాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. పోలీసు సిబ్బంది బాలికల తల్లిదండ్రులను వెనక్కి పంపించారు.
కాషాయ శాలువాలతో ఆందోళన చేపడుతున్న విద్యార్థులు Karnataka Hijab News: ఉడిపిలోనే మరో కళాశాలలోనూ హిజాబ్ ధరించి వచ్చిన 28 మంది విద్యార్థినులను అధికారులు లోపలికి అనుమతించలేదు. బాలికలు తరగతుల వెలుపల నిరసన తెలిపారు. క్లాస్‌రూమ్‌లలోకి హిజాబ్‌లు ధరించి వస్తామన్న అమ్మాయిల డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ 100 మంది హిందూ విద్యార్థులు కాషాయ శాలువాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
Karnataka Hijab Ban: హిజాబ్ ధరించిన విద్యార్ధినులు అడ్డుకోవడంపై కర్ణాటక మంత్రి అంగర స్పందించారు. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు యథాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశించారు. ప్రతి కళాశాలకు ప్రత్యేక నిబంధనలు రూపొందించడం కష్టమన్న మంత్రి.. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హిజాబ్ ధరించిన విద్యార్థినులను తరగతులకు హాజరు కానివ్వబోమని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. అయితే హిజాబ్ ధరించడం తన ప్రాథమిక హక్కని దానిని హరిస్తున్నారని నిరసన తెలుపుతున్న విద్యార్థిని ఒకరు కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఫిబ్రవరి 8న హైకోర్టు విచారణ జరపనుంది.
ఇదీ చదవండి:'సీడీ కేసు'లో మాజీ మంత్రికి క్లీన్ చిట్