తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పికప్' చేసుకోకుండా వెళ్లిన బస్సు.. ఆర్టీసీకి రూ.1000 ఫైన్! - కేఎస్​ఆర్టీసీ కేరళదా కర్ణాటకదా?

సకాలంలో స్టాపు వద్దకు చేరుకున్నప్పటికీ ప్రయాణికుడ్ని ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన కర్ణాటక ఆర్టీసీకి వినియోగదారుల కోర్టు జరిమానా విధించింది. ఘటన జరిగిన ప్రాంతం వేరే రాష్ట్రంలో ఉన్న కారణంతో కేసును కొట్టేయాలన్న కేఎస్​ఆర్టీసీ వాదనను తోసిపుచ్చింది. బాధిత ప్రయాణికునికి రూ.1000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ksrtc
కేఎస్​ఆర్టీసీ

By

Published : Nov 16, 2021, 1:33 PM IST

బస్‌స్టాప్‌లో ప్రయాణికుడ్ని ఎక్కించుకోకుండా బస్సు వెళ్లిపోయిన ఘటనలో కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్‌ఆర్‌టీసీ)కి వినియోగదారుల కోర్టు జరిమానా విధించింది. ఈ ఘటనలో సదరు ప్రయాణికుడు నిర్ణీత సమయానికే బస్‌స్టాప్‌కు చేరుకున్నప్పటికీ 'పికప్' చేసుకోలేదని పేర్కొంటూ.. రూ.1,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ఇదీ జరిగింది..

బెంగళూరులోని బనశంకరికి చెందిన 67 ఏళ్ల ఎస్. సంగమేశ్వరన్ 2019 అక్టోబర్ 12న కేఎస్‌ఆర్‌టీసీ- ఐరావత్ క్లబ్ బస్సులో బెంగళూరు నుంచి తమిళనాడులోని తిరువన్నమలైకి.. టిక్కెట్‌ బుక్ చేసుకున్నారు. అక్కడి నుంచి బెంగళూరుకు రిటన్​ వచ్చే టికెట్​నూ బుక్ చేశారు. అయితే.. అక్టోబరు 13, 2019న నిర్ణీత సమయానికి తిరువన్నమలై బస్‌స్టాప్‌కు చేరుకున్న సంగమేశ్వరన్​ను.. ఎక్కించుకోకుండానే బస్సు వెళ్లిపోయింది. బదులుగా కండక్టర్ ఫోన్ నెంబర్​తో పాటు.. ప్రయాణ వివరాలతో కూడిన ఓ మెసేజ్ వచ్చింది.

వెంటనే ఫోన్ చేయగా.. తిరువన్నమలై నుంచి బస్సు బయలుదేరిందని, ఆలస్యంగా ఎందుకొచ్చావని కండక్టర్ సంగమేశ్వరన్​నే నిందించాడు. అనంతంరం ఆ వృద్ధుడు తమిళనాడులోని హోసూర్‌కు బస్సులో, అక్కడి నుంచి బెంగళూరుకు మరో బస్సులో చేరుకున్నాడు.

ఈ ఘటనకు కేఎస్‌ఆర్‌టీసీ ఎండీని బాధ్యుడిగా చేస్తూ.. సంగమేశ్వరన్ బెంగళూరు రెండో పట్టణ అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.

'వేరే రాష్ట్రం కదా.. కొట్టేయండి..'

దీనిపై కేఎస్​ఆర్టీసీ తన వాదనలను వినిపిస్తూ.. సంబంధిత బస్టాప్‌ మారిన సంగతిని ఫిర్యాదుదారుడికి ఎస్​ఎంఎస్ ద్వారా సమాచారం అందించినట్లు పేర్కొంది. అంతేగాక.. మారిన బస్టాప్​ వద్ద దాదాపు 23 మంది ప్రయాణికులను ఎక్కించుకొని వచ్చినట్లు తెలిపింది. అలాగే.. ఘటన జరిగిన ప్రదేశం వేరే రాష్ట్రంలో ఉన్నందున కేసును కొట్టేయాలని వాదించింది.

కానీ.. కేఎస్​ఆర్టీసీ వాదనలతో వినియోగదారుల కోర్టు ఏకీభవించలేదు. ఆధారాల సమర్పణలో విఫలమయ్యారని పేర్కొంటూ.. వృద్ధుడైన ఫిర్యాదుదారుకు కలిగిన అసౌకర్యానికి రూ.1,000 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

అలాగే.. అతని వద్ద వసూలు చేసిన టిక్కెట్ ఛార్జీ రూ.497, బెంగళూరు చేరుకునేందుకైన ఇతర బస్సు ఛార్జీలు రూ.200 అదనంగా చెల్లించాలని తీర్పునిచ్చింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details