ఇస్లాం అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని కేంద్రం.. ఆ సంస్థపై నిషేధం విధించడం సబబేనని అభిప్రాయపడింది. బ్యాన్‌ను వ్యతిరేకిస్తూ కర్ణాటక పీఎఫ్ఐ అధ్యక్షుడు నాసిర్ అలీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు చెప్పింది.
'PFIపై నిషేధం కరెక్టే'.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు - పీఎఫ్ఐ నిషేధం
పీఎఫ్ఐని నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదేనని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది.
పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది జయకుమార్ పాటిల్.. పీఎఫ్ఐపై నిషేధం విధించడం చట్టవిరుద్ధమని అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ నిషేధం విధించారని వాదించారు. పీఎఫ్ఐని చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించడానికి తగిన కారణాలు లేవని వ్యాఖ్యానించారు. పిటిషనర్ వాదనలను ఖండిస్తూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక వ్యాఖ్యలు చేశారు. పీఎఫ్ఐ దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, అంతర్జాతీయ ఉగ్రవాదులతో చేతులు కలిపిందని పేర్కొన్నారు. దేశంలో భయానక వాతావరణం సృష్టిస్తోందని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్రం నిర్ణయం సరైనదేనని స్పష్టం చేసింది.
సెప్టెంబర్ 28న పీఎఫ్ఐని నిషేధిస్తూ కేంద్రం ప్రకటన జారీ చేసింది. ఐదు సంవత్సరాల వరకు నిషేధం అమలులో ఉంటుందని ప్రకటించింది. అంతకుముందు, పలు పీఎఫ్ఐ కార్యాలయాలపై దాడి చేసిన కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఇచ్చిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ఐకి అంతర్జాతీయ ఉగ్ర ముఠాలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో నిషేధం విధించింది. పీఎఫ్ఐ వ్యవస్థాపకులు.. సిమీ, జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ అనే నిషేధిత ఉగ్రసంస్థ సభ్యులేనని పేర్కొంది.