కర్ణాటక హైకోర్టు ఓ నిందితుడికి జైలు శిక్షతో పాటుగా భిన్నమైన తీర్పును ఇచ్చింది. ఓ వ్యక్తిపై ఆయుధంతో దాడి చేసిన కేసులో రెండేళ్లు శిక్ష పడిన 81 ఏళ్ల నిందితుడికి ట్రయల్ కోర్టు విధించిన శిక్షను 3 రోజులకు సవరించింది హైకోర్టు. నిందితుడికి వృద్ధాప్యం కారణంగా ఏదైనా ఒక అంగన్వాడీ కేంద్రంలో ఏడాది పాటు ఉచితంగా సేవ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో ఐతప్ప అనే వ్యక్తిని ట్రయల్ కోర్టు నిందితుడిగా తేల్చి 2 సంవత్సరాలు జైలు శిక్షను విధించింది. దీంతో నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఈ తీర్పును వెల్లడించింది.
అసలేం జరిగిందంటే?
2008లో దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వాలా ప్రాంతానికి చెందిన ఐతప్ప నాయక్ అనే ఓ వృద్ధడు.. ఓ వ్యక్తిపై ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఐతప్పను అప్పటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2012 జూన్ 7న బంట్వాలా ట్రయల్ కోర్టు నిందితుడు ఐతప్పకు 2 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.5000 జరిమానా విధించింది. దీంతో ఐతప్ప ట్రయల్ కోర్టు తీర్పును ప్రశ్నిస్తూ.. హైకోర్టులో అప్పీల్ చేశాడు.
'పిటిషన్ దారుడు తన నేరాన్ని అంగీకరించాడు. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు నిందితుడు ఇప్పటికే 3 రోజుల సాధారణ జైలు శిక్షను అనుభవించాడు. ప్రస్తుతం ఐతప్పకు 81 ఏళ్లు.. పిల్లలు లేరు. దీంతో వృద్ధాప్యంలో ఉన్న తన భార్య ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉంది. దీంతో పాటుగా నిందితుడు సామాజిక సేవ చేసేందుకు కూడా సిద్ధపడ్డాడు' అని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఐతప్ప విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని శిక్షను సవరిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఐతప్పకు మూడు రోజుల సాధారణ జైలు శిక్షను 3 రోజులకు తగ్గిస్తూ.. రూ.10,000 జరిమానా చెల్లించాలని కోరింది. దీనికి అదనంగా నిందితుడు 2023, ఫిబ్రవరి 20 నుంచి ఏడాది పాటుగా జీతం లేకుండా అంగన్వాడీలో సేవ చేయాలని ఆదేశించింది.