తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid 4th Wave:'జూన్‌ నుంచి కరోనా ఫోర్త్ వేవ్'​ - కరొనా నాలుగో దశ

Covid 4th Wave: కరోనా నాలుగో దశపై కీలక వ్యాఖ్యలు చేశారు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్​. కరోనా వ్యాప్తి జూన్‌ తర్వాత గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని.. దాని ప్రభావం అక్టోబర్‌ వరకు ఉంటుందని కాన్పూర్‌ ఐఐటీ నిపుణులు అంచనా వేసినట్టు తెలిపారు.

Covid 4th wave news
Covid 4th wave news

By

Published : Apr 27, 2022, 9:56 AM IST

Covid 4th Wave: దేశంలోని పలు రాష్ట్రాల్లో మళ్లీ కొవిడ్‌ కొత్త కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. ఈ పెరుగుదల నాలుగో దశ ఆరంభానికి సూచనగా పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. తగిన జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం విజృంభణ ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు మళ్లీ మాస్క్‌ ధరించడాన్ని తప్పనిసరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా నాలుగో దశ జూన్‌ తర్వాత గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చనీ.. దాని ప్రభావం అక్టోబర్‌ వరకు ఉంటుందని కాన్పూర్‌ ఐఐటీ నిపుణులు అంచనా వేసినట్టు తెలిపారు. వ్యాక్సిన్లు వేయించుకోవడం, మాస్క్‌ ధరించడం వంటి ముందు జాగ్రత్తలు పాటిస్తూనే కరోనా వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకోవాలని సూచించారు.

బెంగళూరులో మంత్రి సుధాకర్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. "కాన్పూర్‌ ఐఐటీ పరిశోధకులు వెల్లడించిన నివేదికలను బట్టి.. కరోనా నాలుగో దశ జూన్‌ చివర్లో ఆరంభమయ్యే అవకాశం ఉంది. జూన్‌ మాసం తర్వాత గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చు. ఈ పెరుగుదల సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ వరకు కొనసాగే అవకాశం ఉంది. గత మూడు కరోనా దశల సమయంలో ఐఐటీ కాన్పుర్‌ పరిశోధకుల బృందం వేసిన అంచనాలు చాలా కచ్చితంగా ఉన్నాయి. శాస్త్రీయ సమాచారం ఆధారంగా వారు రూపొందించిన తాజా నివేదికలోని విషయాలు నిజమయ్యే అవకాశాలు అధికం. కరోనా కేసులు ప్రారంభమై రెండేళ్లవ్వడం వల్ల దానికి సంబంధించిన పూర్తి సమాచారం మన వద్ద ఉంది. ఈ ప్రపంచం నుంచి కరోనా పూర్తిగా మాయమైపోతుందని మనం చెప్పలేం. అందువల్ల వ్యాక్సిన్‌ వేయించుకోవడం, మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్లు రాసుకోవడం వంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటూ జీవించడం నేర్చుకోవాలి. గతంలో కూడా మనం ఇదే చేశాం" అని వ్యాఖ్యానించారు.

కర్ణాటకలో కరోనా నాలుగో దశ ఉందా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమ వద్ద కొవిడ్‌ కేసులు స్వల్పంగానే ఉన్నాయన్నారు. అందువల్ల అలా చెప్పడం సరికాదన్నారు. పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న వేళ దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ పెట్టారనీ.. ఆ భేటీలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తారన్నారు. ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టడం వల్ల థర్డ్‌ వేవ్‌లో మరణాలు/ఆస్పత్రిలో చేరికల్ని నియంత్రించగలిగిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీకా నిల్వలు సరిపడా ఉన్నాయనీ.. ఎవరైనా రెండో డోసు ఇంకా వేసుకోనట్లయితే తక్షణమే వెళ్లి వేయించుకోవాలని సూచించారు. బూస్టర్‌ డోసు ఉచితంగా పంపిణీ చేస్తారా అని అడగ్గా.. ప్రధాని నరేంద్ర మోదీ రేపటి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలన్నారు.

ఇదీ చదవండి:బూస్టర్​తో కొవిడ్ దూరం.. తాజా అధ్యయనంలో వెల్లడి

ABOUT THE AUTHOR

...view details