Karnataka Gruha Lakshmi Scheme :శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కుటుంబ పెద్దగా ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం అందించే 'గృహ లక్ష్మి' పథకాన్ని బుధవారం ప్రారంభించింది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం. దాదాపు 1.1 కోట్ల మంది మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద లబ్ది పొందనున్నారు. మైసూరులోని మహారాజాలో కాలేజీ గ్రౌండ్లో 'గృహ లక్ష్మి' పథకాన్ని ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు.
'ఎన్డీఏ సర్కార్ బిలియనీర్ల కోసమే'
Rahul Gandhi On BJP :ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. ఎన్డీఏ సర్కార్ బిలియనీర్ల కోసం మాత్రమే పనిచేస్తుందని విమర్శించారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన అని అన్నారు. కర్ణాటకలో ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన కీలక వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీనిలబెట్టుకుందని రాహుల్ తెలిపారు.
'మేము వాగ్దాలకు కట్టుబడి ఉన్నాం. ఎప్పుడూ తప్పుడు వాగ్దానాలు చేయం. కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలు కేవలం పథకాలు మాత్రమే కాదు. అవి పాలనా నమూనాలు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కర్ణాటకలో 600 కి.మీ నడిచాను. వేల మంది మహిళలతో మాట్లాడాను. నాకు అప్పుడు అర్థమైంది. ద్రవ్యోల్బణం కారణంగా పేదలు ఇబ్బంది పడుతున్నారని.' అని రాహుల్ తెలిపారు.