Akansha Puranik: సితార్, తబలా, హార్మోనియంపై ఆమె సుస్వరాలు పలికించగలదు. కీబోర్డ్, గిటార్ వాయిస్తూ రాక్‌స్టార్‌లా మారిపోగలదు. మైక్ పట్టి పాటలు పాడుతూ శ్రోతల్ని సంగీత ప్రపంచంలో విహరింపచేయగలదు. భరతనాట్యంతో వీక్షకుల్ని ముగ్ధుల్ని చేయగలదు. సంప్రదాయ కళలే కాక.. మరెన్నో రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తోంది కర్ణాటక కలబురగికి చెందిన ఆకాంక్ష పురాణిక్. పాటలు పాడడం, నాట్యం చేయడం, సంగీత పరికరాలు వాయించడం, కరాటే, కిక్ బాక్సింగ్ వంటి 60కిపైగా కళల్లో ప్రావీణ్యం సాధించింది ఆమె. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని.. 300కుపైగా మెడల్స్, షీల్డ్స్, 600కుపైగా సర్టిఫికెట్లు సొంతం చేసుకుంది.
"మా అమ్మే నాకు స్ఫూర్తి. నేను అన్ని రంగాల్లోనూ రాణించాలన్నది ఆమె కల. కరాటేలో చేరేందుకు నా సోదరులు కారణం. వారు కరాటే క్లాసులకు వెళ్లేవారు. ఓసారి చూసేందుకు వెళ్లా. నాకు ఆసక్తి కలిగి కరాటేలో చేరా. నా సోదరుడు తబలా క్లాస్‌కు వెళ్లేవాడు. అది చూసి నేను కూడా చేరా. అలా అన్నింటిలోనూ చేరా. ఐఏఎస్ అధికారి అయి ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం."
--ఆకాంక్ష పురాణిక్
Kalaburagi Girl News