తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేషన్​ బియ్యానికి బదులుగా డబ్బులు.. కిలోకు రూ.34 ఇస్తామన్న ప్రభుత్వం - బియ్యం బదులు నగదు ఇవ్వాలని కర్ణాటక నిర్ణయం

Karnataka Free Rice Scheme : రాష్ట్ర ప్రజలకు రేషన్​ బియ్యానికి బదులుగా నగదును ఇవ్వనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కిలోకు 34 రూపాయల చొప్పున అందించనున్నట్లు తెలిపింది. బుధవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్వర్యంలో జరిగిన రాష్ట్ర కేబినెట్​ సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

karnataka-free-rice-scheme-government-decided-to-give-cash-instead-of-rice
karnataka-free-rice-scheme-government-decided-to-give-cash-instead-of-rice

By

Published : Jun 28, 2023, 3:42 PM IST

Updated : Jun 28, 2023, 4:53 PM IST

Karnataka Free Rice Scheme : కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలకు రేషన్​ బియ్యానికి బదులుగా నగదును ఇవ్వనున్నట్లు తెలిపింది. కిలోకు 34 రూపాయల చొప్పున అందించనున్నట్లు వెల్లడించింది. పూర్తి మొత్తంలో బియ్యాన్ని సేకరించి వాటిని ప్రజలకు సరాఫరా చేసేంత వరకు.. జులై 1 నుంచి ఇలా నగదును ఇవ్వనున్నట్లు పేర్కొంది. బుధవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్వర్యంలో జరిగిన రాష్ట్ర కేబినెట్​ సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కర్ణాటకలో అధికారంలోకి వస్తే.. ప్రతి బీపీఎల్​ కుటుంబానికి నెలకు 10 కిలోల ఉచిత బియ్యం ఇస్తామని కాంగ్రెస్​ పార్టీ హామీ ఇచ్చింది. 'అన్నభాగ్య' అనే పేరుతో జులై 1న ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికిప్పుడే అంత మొత్తంలో ప్రజలకు బియ్యం సరఫరా చేయడంలో కాస్త ఇబ్బందులు తలెత్తవచ్చనే అభిప్రాయంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో నెలకు ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని ప్రజలకు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి అదనంగా మరో ఐదు కిలోల బియ్యాన్ని ఇస్తామని తన ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్​ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం బియ్యం సేకరణలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. రైస్​కు బదులుగా నగదును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

"జులై 1నే 'అన్నభాగ్య' పథకం ప్రారంభమవుతున్న తరుణంలో.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్​తో పాటు మిగతా కేబినెట్ మంత్రులం బుధవారం సమావేశమయ్యాం. కొద్ది రోజుల వరకు బియ్యానికి బదులుగా నగదును ఇవ్వాలని నిర్ణయించాం. బియ్యం ప్రామాణిక ధరను రూ.34గా పుడ్​ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా నిర్ణయించింది. అంతే మొత్తాన్ని ప్రజలకు మేము కూడా ఇవ్వాలని నిర్ణయించాం." అని సమావేశం ముగిసిన అనంతరం మంత్రి కేహెచ్ మునియప్ప మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం భారీ మొత్తంలో బియ్యం సేకరణను ప్రయత్నిస్తోందని.. కానీ అవసరానికి తగినట్లుగా వాటిని సరఫరా చేసేందుకు ఏ సంస్థ ముందుకు రావట్లేదని ఆయన తెలిపారు.

ఒక రేషన్​ కార్డ్​లో ఒకే వ్యక్తి ఉన్నా.. వారికి నెలకు ఐదు కిలోల బియ్యానికి బదులుగా 170 రూపాయలు చెల్లిస్తామని మునియప్ప వివరించారు. ఇద్దరు ఉంటే రూ.340, ఐదుగురుంటే రూ.850 ఇస్తామన్నారు. ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వివరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీల్లో అన్నభాగ్య పథకం ఒకటని.. అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెట్​ సమావేశంలో దాని అమలుకు నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.

Last Updated : Jun 28, 2023, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details