బెంగళూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయంలోని గాంధీ కృషీ విజ్ఞాన కేంద్రం(జీకేవీకే)లో వ్యవసాయ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో రైతులు(karnataka farmers) తాము అనుసరిస్తున్న వినూత్న విధానాలను ప్రదర్శిస్తున్నారు. వ్యసాయంలో మెలకువలు పాటిస్తే లాభాలు గడించవచ్చని కర్ణాటక రైతులు చెబుతున్నారు. సాధారణంగా మేలు జాతి గిత్తలు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు ధర పలుకుతాయి. అయితే కర్ణాటకలోని మాళవళ్లి నుంచి జీకేవీకే మేళాకు తెచ్చిన హళ్లికార్ జాతి గిత్త ఏకంగా రూ.కోటి పలుకుతోందని ఆ గిత్త యాజమని బొరేగౌడ చెబుతున్నారు. అంతరించి పోతున్న హళ్లికార్ జాతి సంరక్షణకు బొరేగౌడ ముందుకొచ్చారు. ఈ జాతి ఆవు పాలలో ఎ-2 ప్రొటీన్ పుష్కలంగా ఉండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు(karnataka farmers news).
హళ్లికార్ జాతికి చెందిన ఈ గిత్త వీర్యం ఒక డోసు ధర రూ.వెయ్యి పైచిలుకు ఉంటుంది. మూడేళ్లు నిండిన గిత్త నుంచి ప్రతి వారం వీర్యాన్ని సేకరించి నైట్రోజెన్ కంటైనర్లలో భద్రపరుస్తారు. వందల ఏళ్ల వరకు ఈ వీర్యాన్ని భద్రపరచవచ్చని జీకేవీకే పశు విజ్ఞాన నిపుణులు చెబుతున్నారు. దేశంలో మొట్ట మొదటి సారిగా ప్రైవేటు సంస్థల సహకారంతో వీర్యాన్ని సేకరించి భద్రపరచటం... హళ్లికార్ జాతులతో మొదలైనట్లు ఇక్కడి రైతులు పేర్కొంటున్నారు. సరైన పోషక ఆహారం అందిస్తే ఈ జాతి పశువులు 20 ఏళ్లు ఆరోగ్యంగా ఉంటాయని చెప్పారు(karnataka farmers agriculture tips). ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర రైతులు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సైతం ఈ జాతుల కోసం ఆసక్తి చూపుతున్నాయి. వ్యవసాయం కంటే సంతానోత్పత్తి కోసమే ఈ జాతులను వినియోగిస్తున్నారు. ఆయా రైతులు తాము వృద్ధి చేసిన హళ్లికార్ గిత్తలను కృష్ణ, ఏకలవ్య వంటి పేర్లతో పిలుస్తుంటారు.
హళ్లికార్ జాతుల్లో కృష్ణ శ్రేష్ఠమైనది. తొలిసారిగా పశువుల వీర్యాన్ని ప్రైవేటు సంస్థల సహకారంతో భద్రపరుస్తున్నాం. ఈ జాతి అంతరించిపోతోంది. రూ.కోటి వరకు చెల్లించి ఈ జాతుల్ని కొనేందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వస్తున్నారు. కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో డిమాండ్ ఉంది.