తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అవినీతికి ప్రతీక అదానీ.. 40% కమీషన్ తీసుకుంటున్నట్లు మోదీ ఒప్పుకున్నారు!' - rahul gandhi news

అవినీతికి అదానీ ప్రతీక అని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ.. అదానీకి మనస్ఫూర్తిగా సహాయం చేస్తే.. తాము కర్ణాటక ప్రజలకు హృదయపూర్వకంగా సహాయం చేస్తామని ఆయన తెలిపారు.

karnataka elections 2023 rahul gandhi
karnataka elections 2023 rahul gandhi

By

Published : Apr 16, 2023, 4:08 PM IST

Updated : Apr 16, 2023, 4:42 PM IST

అవినీతికి అదానీ ప్రతీక అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. అధికార బీజేపీ, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలోని బీజేపీ సర్కారు ప్రతి పనికి 40 శాతం కమీషన్లు తీసుకుంటోందని ఆరోపించారు. కోలార్​లో నిర్వహించిన జై భారత్​ ర్యాలీ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.

"మోదీ.. మీరు అదానీకి వేల కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే.. మేము కర్ణాటకలోని పేదలు, మహిళలు, యువతకు కూడా డబ్బు ఇవ్వగలం. మీరు అదానీకి మనస్ఫూర్తిగా సహాయం చేశారు. కర్ణాటక ప్రజలకు మేము హృదయపూర్వకంగా సహాయం చేస్తాం. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఏ పని చేసినా 40% కమీషన్ తీసుకుంటోంది. ప్రతి పనికి 40% కమీషన్ తీసుకుంటున్నట్లు ప్రధానికి లేఖ రాశాను. కానీ ఆయన ఇంకా సమాధానం ఇవ్వలేదు. అంటే 40% కమీషన్ తీసుకున్నట్లు ప్రధాని అంగీకరించనట్లే కదా?"
-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

కర్ణాటకలో కాంగ్రెస్​ పార్టీయే అధికారంలోకి వస్తుందని రాహుల్​ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి క్యాబినెట్​ సమావేశంలోనే కీలక హామీలను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా పోరాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని రాహుల్​ అన్నారు. ఈ బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ఇన్‌ఛార్జ్​ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలా, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, శాసనసభా పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు పాల్గొన్నారు.

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇదే కోలార్‌ వేదికగా చేసిన వ్యాఖ్యలు రాహుల్​ను కోలుకోలేని దెబ్బ కొట్టాయి! 2019 ఏప్రిల్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా కోలార్‌లో జరిగిన ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌.. మోదీ ఇంటి పేరును ప్రస్తావించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై నేరపూరితమైన పరువు నష్టం కేసు దాఖలు కాగా.. దోషిగా తేలిన రాహుల్​కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో ఎంపీగా ఆయన అనర్హతకు గురయ్యారు. ఇటీవలే ఆయన దిల్లీలో తన అధికారిక నివాసాన్ని ఖాళీ కూడా చేశారు.

అయితే కాంగ్రెస్‌ పార్టీకి కోలార్‌ ఎంతో ముఖ్యమైన స్థానం. ఇక్కడి నుంచి పోటీ చేయాలని (రెండో స్థానంగా) మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే వరుణ (మైసూర్‌) స్థానం నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమైంది. అయితే కాంగ్రెస్‌ మాత్రం కోలార్‌లో ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు మే 10న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మే13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Last Updated : Apr 16, 2023, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details