కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ.. టికెట్ల పంపిణీ అగ్గిరాజేసింది. పార్టీ టికెట్ ఆశించి భంగపడిన వారంతా రాజీనామాల బాటపట్టారు. ఇప్పటివరకు రెండు జాబితాలు విడుదల చేసిన కమలనాథులు.. దాదాపు 60మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించారు. దీంతో పలువురు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇటీవలే ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. ఉత్తర కన్నడలోని శిరసి పట్టణానికి ఆదివారం మధ్యాహ్నం చేరుకున్న జగదీశ్ షెట్టర్.. స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగేరికి తన రాజీనామా పత్రాన్ని అందించారు.
'కరివేపాకులా పడేశారు.. 20-25 స్థానాలు..'
వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుబ్బళ్లి- ధార్వాడ నుంచి పోటీచేసేందుకు మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్‌కు భాజపా ఈసారి అవకాశం కల్పించలేదు. దీంతో ఆగ్రహించిన ఆయన.. ఎంతో సేవ చేసిన తనను కరివేపాకులా తీసిపాడేశారంటూ పార్టీ నాయకత్వంపై మండిపడ్డారు. తనకు టికెట్ ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో పార్టీ కనీసం 20-25 సీట్లను కోల్పోవాల్సి వస్తుందని పార్టీ అధిష్ఠానాన్ని హెచ్చరించారు. కేంద్ర నాయకత్వంపై విశ్వాసం ఉన్నప్పటికీ కేవలం రాష్ట్ర నేతలే పార్టీ నుంచి నెట్టేశారని ఆరోపించారు. అయినప్పటికీ అధిష్ఠానం నుంచి ఎటువంటి హామీ రాకపోవడం వల్ల పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
"వయస్సు ఒక కారణమా? లేదు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఏదైనా క్లబ్‌ను నడుపుతున్నానా లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డానా లేదా నేను రౌడీ షీటర్నా? ఏమి లేదు. మరెందుకు నాకు టికెట్ కేటాయించలేదు?" అని ఆయన ప్రశ్నించారు. గత 30 ఏళ్లుగా తాను అత్యంత చిత్తశుద్ధితో పార్టీ కోసం కృషి చేశానని తెలిపారు. "యడియూరప్పకు కూడా మంచి పదవి ఇచ్చారు. మరి ఆయనెందుకు అప్పుడు బీజేపీని విడిచిపెట్టారు?" అంటూ ప్రశ్నించారు. తనకు హైకమాండ్ రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని.. అందుకు తాను నిరాకరించినట్లు తెలిపారు.
'ఏం అన్యాయం చేశాం.. కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నా..'
జగదీశ్ శెట్టర్‌కు తాము ఏమి అన్యాయం చేశామని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రశ్నించారు. ఆయన తన ప్రాంత ప్రజలు క్షమించరని అన్నారు. షెట్టర్‌ను రాజ్యసభ సభ్యుడిగా చేసి కేంద్ర మంత్రి పదవికి ఇస్తామని హైకమాండ్ ఆఫర్ చేసిందని యడియూరప్ప చెప్పారు. కానీ ఆయన బీజేపీకి ద్రోహం చేశారన్నారు. అందుకే రాష్ట్ర పర్యటన చేసి ఆయన చేసి ద్రోహాన్ని చెబుతానని ఆయన అన్నారు. "మీరు కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్తున్నారు.. మేం మీకు పదవి ఇవ్వమని చెప్పామా?" అని యడియూరప్ప ప్రశ్నించారు. "అతనికి ఏం అన్యాయం చేశాం.. కాంగ్రెస్‌లోకి వెళ్లాలని ముందే నిర్ణయించుకున్నారు.. వదిలేయండి" అని అన్నారు. కర్ణాటకలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఏ శక్తీ అడ్డుకోలేదన్నారు. స్పష్టమైన మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.