Karnataka Election Results 2023 : కర్ణాటక ఎన్నికల ఫలితాలు వివాదాస్పద మైనింగ్ వ్యాపారి గాలి జనార్దనరెడ్డి కుటుంబానికి తీవ్ర నిరాశను మిగిల్చాయి. జనార్దనరెడ్డి మినహా పోటీలో ఉన్న కుటుంబసభ్యులందరూ ఓటమి పాలయ్యారు. ఆయన సోదరులు సోమశేఖరరెడ్డి, కరుణాకర్‌రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేయగా.. భార్య లక్ష్మీ అరుణ, జనార్దనరెడ్డి సొంత పార్టీ కల్యాణ రాజ్యప్రగతి పక్ష అభ్యర్థులుగా బరిలో నిలిచారు. వారి కంచుకోటగా భావించే బళ్లారిలో భార్య, సోదరుడు సోమశేఖరరెడ్డిని కాదని కాంగ్రెస్ అభ్యర్థికి పట్టం కట్టారు ఓటర్లు. హరపనహళ్లి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన కరుణాకర్‌రెడ్డి.. ప్రత్యర్థి లతా మల్లిఖార్జున్ చేతిలో ఓటమిపాలయ్యారు. మరోవైపు ఆయన సన్నిహితుడు మాజీ మంత్రి శ్రీరాములు సైతం కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్ర చేతిలో ఓడిపోయారు.
Kalyana Rajya Pragati Party : ఎన్నో అంచనాల మధ్య పార్టీ పెట్టిన వివాదాస్పద మైనింగ్ వ్యాపారి గాలి జనార్దనరెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. కల్యాణ రాజ్యప్రగతి పక్ష పేరుతో పార్టీని స్థాపించి బరిలోకి దిగగా.. ఆయన ఒక్కరే గెలిచారు. గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఇక్భాల్ అన్సారీపై గెలుపొందారు. బళ్లారి సిటీ నియోజకవర్గంలో తన సోదరుడు, బీజేపీ నేత సోమశేఖరెడ్డిపై భార్య లక్ష్మీని కేఆర్పీపీ అభ్యర్థిగా పోటీకి దింపగా ఇద్దరూ పరాజయం పాలయ్యారు. గాలి కుటుంబానికి కంచుకోటగా ఉన్న బళ్లారిలో కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి ఘనవిజయం సాధించారు.
బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి వదిన, మరిది పోటీలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి నారా భరత్ రెడ్డి బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే అనిల్ లాడ్ జేడీఎస్ నుంచి పోటీ చేశారు. అయితే, గాలి కుటుంబం ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతం కావడం వల్ల వదిన, మరిది మధ్యే తీవ్ర పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి రేసులోకి వచ్చి ఘన విజయం సాధించారు.