తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​లో నయా జోష్.. ఇక ఆ రాష్ట్రాలపై దృష్టి.. నాయకుల మధ్య సయోధ్య కుదిరేనా? - మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2023

Karnataka election result : కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్​ పార్టీలో కొత్త జోష్ వచ్చింది. అయితే మల్లికార్జున ఖర్గే అధినాయకత్వం, రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర.. ఎంత వరకు ఇందులో ప్రభావం చూపాయి? పార్టీ భవిష్యత్​ లక్ష్యాలు ఏంటి?

congress-party-next-strategy-on-assembly-election-2023
కాంగ్రెస్ తదుపరి వ్యూహం

By

Published : May 13, 2023, 6:07 PM IST

Updated : May 13, 2023, 7:42 PM IST

Karnataka election result : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ మెజారిటీ సీట్లు సాధించింది. 136 సీట్లు దక్కించుకొని ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించింది. దీంతో కాంగ్రెస్​ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. పార్టీ​ శ్రేణుల్లో సైతం ఉత్సాహం రెట్టింపైంది. అయితే అదే స్ఫూర్తిని మిగతా రాష్ట్రాల్లోను కొనసాగించాలని కాంగ్రెస్​ పార్టీ భావిస్తోంది. మరో ఆరు నెలల్లో వచ్చే రాజస్థాన్, ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాలపై ​కాంగ్రెస్​ పార్టీ కన్నేసింది.

ఖర్గే అధినాయకత్వం..
కర్ణాటకలో గెలుపునకు మల్లికార్జున ఖర్గే అధినాయకత్వం ఎంతో ఉపయోగపడింది. ఆ రాష్ట్రానికే చెందిన ఖర్గే.. పార్టీ జాతీయ అధ్యక్ష పదవిలో ఉండటం కాంగ్రెస్​కు మేలు చేసింది. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన తతంగమంతా చాలా రోజులు పాటు వార్తాల్లో నిలిచింది. ఇది కూడా కాంగ్రెస్​ పార్టీకి గెలుపుకు కలిసివచ్చింది. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ డీకే శివకుమార్​ మధ్య విభేదాలు బయటకు పొక్కకుండా పార్టీ జాగ్రత్తపడింది. వారిద్దరు తమ నాయకుడు ఖర్గే అని చెప్పుకుంటూ ప్రచారం నిర్వహించారు.

మల్లికార్జున ఖర్గే

రాహుల్​ గాంధీ జోడో యాత్ర..
రాహుల్​ గాంధీ జోడో యాత్ర సైతం కర్ణాటకలో కాంగ్రెస్​ పార్టీ గెలుపుపై ప్రభావం చూపింది. పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. కర్ణాటకలో పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసిన నాయకత్వం.. అక్కడ జోడో యాత్ర 21 రోజులు సాగేలా ప్రణాళికలు రూపొందించింది. వివిధ రాష్ట్రాల గుండా రాహుల్​ గాంధీ చేపట్టిన జోడో యాత్ర.. కర్ణాటకలోనే ఎక్కువ రోజుల పాటు సాగింది. ఆ తరువాత కేరళ, రాజస్థాన్​ రాష్ట్రాల్లో చెరో 18 రోజుల పాటు జరిగింది. దక్షిణ భారత రాష్ట్రాలైన.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​లో కేవలం నాలుగు రోజుల పాటే ఈ యాత్ర సాగింది.

రాహుల్​ గాంధీ భారత్ జోడో యాత్ర

2022 సెప్టెంబర్​ 7న ప్రారంభమైన రాహుల్​ గాంధీ జోడో యాత్ర.. సెప్టెంబర్​ 30న కర్ణాటకలోని చామరాజనగర జిల్లా గుండ్లుపేట ప్రాంతంలోకి ప్రవేశించింది. చామరాజనగర, మైసూరు, మాండ్య, తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి రాయచూరు మీదుగా.. మొత్తం 500 కిలోమీటర్ల వరకు ఈ యాత్ర సాగింది. అయితే రాహుల్​ గాంధీ జోడో యాత్ర కాంగ్రెస్​కు సంజీవని వంటిదని ఆ పార్టీ జనరల్​ సెక్రెటరీ జైరాం రమేశ్​ అభిప్రాయపడ్డారు. ఇది పార్టీని ఉత్తేజపచిందని వెల్లడించారు. జోడో యాత్ర పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య ఐక్యతను, సంఘీభావాన్ని పెంచిదని తెలిపారు.

2024 పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం..
కర్ణాటకలో కాంగ్రెస్​ పార్టీ గెలుపు.. 2024లో జరిగే పార్లమెంట్​ ఎన్నికలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో బలంగా ఉన్న బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు.. ఈ గెలుపు దోహదపడనుంది. పార్టీ శ్రేణుల్లో సైతం బీజేపీని ఓడించగలమన్న ధీమా సైతం వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్​తో జతకట్టేందుకు భాజపాయేతర పార్టీలు ఆసక్తి చూపే అవకాశం..
ప్రస్తుతం కాంగ్రెస్​ పార్టీతో జతకట్టేందుకు భాజాపాయేతర పార్టీలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. అందుకు గల కారణం.. గతంలో జరిగిన చాలా ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ఓడిపోవడమే. అయితే కర్ణాటక గెలుపుతో.. కాంగ్రెస్​పై మిగతా పార్టీలకున్న ప్రతికూల అభిప్రాయం తొలగిపోవచ్చు. కాంగ్రెస్​తో జతకట్టేందుకు అవి ముందుకు రావచ్చు.

కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరగడం..
రెండు దఫాలుగా పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓడిపోవడం, చాలా రాష్ట్రాల్లో కనీస పోటీ ఇవ్వకపోవడం, మరికొన్ని రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు సాధించుకున్నా అధికారం చేజిక్కించుకోవడంలో విఫలం కావడం వంటి అంశాలతో.. కాంగ్రెస్​ పార్టీపై ప్రజల్లో నమ్మకం కొరవడింది. కర్ణాటక గెలుపుతో ప్రజల్లో పార్టీపై నమ్మకం పెరిగే అవకాశం ఉంది.

భాజపా హిందుత్వ రాజకీయాలకు.. కాంగ్రెస్ చెక్ పెట్టే అవకాశం..
కేంద్రంలో, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి.. ఆ పార్టీ చేపట్టే హిందుత్వ రాజకీయాలే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సెక్యులర్​ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్​కు.. బీజేపీ చేపట్టే హిందుత్వ రాజకీయాలు కాస్త ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ.. ఈ తరహా విధానాన్నే బీజేపీ అనుసరించింది. భజరంగ్ దళ్​ను​ బ్యాన్ చేస్తామని కాంగ్రెస్​ ఇచ్చిన హామీతో కన్నడ రాజకీయం కొత్త పుంతలు తొక్కింది. ప్రచారం మొత్తం ఆంజనేయ స్వామి చుట్టూ తిరిగింది. మోదీ సైతం మిగతా అంశాలను పక్కన పెట్టి ప్రజల చేత బంజరంగ్ దళ్​ నినాదాలు చేయించటం, హనుమాన్ చాలీసా పఠనం చేయించడం వంటివి చేశారు. అంతకు ముందు కూడా హిజాబ్​, హలాల్, లవ్​ జిహాద్​ వంటి అంశాలను రాష్ట్రంలో బీజేపీ లేవనెత్తింది. అయినా కూడా ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడం వల్ల.. ఆ విధానాలను ఎంచుకునేందుకు బీజేపీ వెనకడుగు వేయొచ్చు. ఇప్పుడు వచ్చిన ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీకి కొంత ఉపశమనం కలగవచ్చు.

మోదీకి తిరుగులేదనే భావనపై ప్రభావం..
రాహుల్​ గాంధీని.. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యర్థిగా కాంగ్రెస్​ పార్టీ ప్రొజెక్ట్​ చేస్తూ వస్తోంది. అయితే నరేంద్ర మోదీకి ఉన్న జనాధరణతో.. రాహుల్​ గాంధీ పోటీ పడలేకపోతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో ఈ ఇరువురు.. భారీగా ప్రచారం చేపట్టారు. అయితే కర్ణాటకలో మోదీ చేపట్టిన ప్రచారం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. చివరి ఆరు రోజుల ప్రచారంలో.. మోదీ భారీ స్థాయిలో రోడ్​షో నిర్వహించి ఉద్వేగపూరిత ప్రసంగాలు ఇచ్చినప్పుటికి అవేవి బీజేపీకి ఓట్లు సాధించి పెట్టలేకపోయాయి. దీంతో మోదీకి తిరుగు లేదనే భావనపై ప్రభావం పడుతుంది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ఫలితాల ప్రభావం..
కర్ణాటక గెలుపు అనంతరం​ కొద్ది నెలల్లో జరిగే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. 2024 పార్లమెంట్​ ఎన్నికలకు ముందు నాలుగు రాష్ట్రాల ఎన్నికల కీలకంగా మారనున్నాయి. ఆ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ, పార్టీ జనరల్​ జనరల్​ సెక్రెటరీ ప్రియాంక గాంధీల నాయకత్వంలో.. రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. వీటిని మరింత ఉద్ధృతం చేసే అవకాశం కూడా ఉంది. అయితే కాంగ్రెస్​ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజస్థాన్​, చత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో బీజేపీ పార్టీయే దానికి ప్రధాన ప్రత్యర్థి. మధ్యప్రదేశ్​లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్​.. అధికార బీజేపీని ఢీ కొట్టాల్సి ఉంది. తెలంగాణలో కేసీఆర్​ సారథ్యంలోని అధికార బీఆర్ఎస్​ పార్టీతో తలపడనుంది.

నాయకుల మధ్య సయోధ్యే ప్రధాన సమస్య..
ఈ నాలుగు రాష్ట్రాల్లో నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి. కర్ణాటకలోనూ డీకే శివకుమార్​, సిద్ధరామయ్య మధ్య కూడా విభేదాలు ఉన్నప్పటికీ.. అది ఎక్కడ బయయకు కనిపించకుండా పార్టీ హైమాండ్​ జాగ్రత్తపడింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ముందే చెప్పకుండా.. అందరు పార్టీ గెలుపునకు కృషి చేసేలా చేసింది. అయితే ఈ సమస్య మిగతా రాష్ట్రాల్లో తీవ్రంగానే ఉంది.

రాజస్థాన్​లో ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్​ పైలట్​ మధ్య సయోద్యకు పార్టీ కృషి చేస్తోంది. సచిన్​ పైలట్​ బహిరంగానే అశోక్​ గహ్లోత్​​పై విమర్శలు గుప్పిస్తున్నారు. హైకమాండ్​ ఆదేశాలు ధిక్కరించి మరీ.. గహ్లోత్ నిర్ణయాలకు వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్నారు. దీన్ని కూడా కర్ణాటక మాదిరిగానే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇక్కడ కూడా పార్టీని మరోసారి గెలిపించేందుకు కసరత్తులు చేస్తోంది.

సచిన్​ పైలట్, అశోక్​ గహ్లోత్

ఛత్తీస్​గఢ్​ కాంగ్రెస్​లోనూ గ్రూప్ రాజకీయాలు ​హైకమాండ్​ కలవరపెడుతున్నాయి. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, పార్టీ సీనియర్ నేత, మంత్రి టీఎస్‌ సింగ్‌ డియో మధ్య కోల్డ్​ వార్ నడుస్తోంది. చాలా సార్లు వీరిద్దరి మధ్య విభేదాలు అధిష్ఠానం వరకు వెళ్లాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం వీరిద్దరిని చెరి రెండున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిని చేస్తాననే హామీతో.. వారికి నచ్చజెప్పింది. మొదట భూపేశ్ బఘేల్ ముఖ్యమంత్రిని చేసింది. రెండున్నర సంవత్సరాలు పూర్తయినప్పటికి భూపేశ్ బఘేల్ పదవిని వదులుకోవడానికి ససేమిరా అనడం వల్ల.. టీఎస్‌ సింగ్‌ అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారిద్దరి విభేదాలు కలగకుండా పార్టీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

భూపేశ్ బఘేల్, టీఎస్‌ సింగ్‌ డియో

2018లో జరిగిన మధ్యప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ఎక్కువ సీట్లు సంపాందించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు కారణంగా ఆ పార్టీ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరి, ఎంపీగా గెలిచి.. కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. అయితే ఈ సారీ అలాంటి ఘటన జరగకుండా కాంగ్రెస్​ పార్టీ జాగ్రత్తపడతోంది. అన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ ఇప్పటికే ప్రజల ముందు వివిధ హామీలను ఉంచారు. మహిళలకు నెలకు రూ.1500, సిలిండర్​ను రూ.500లకే ఇస్తామన్నారు.

కమల్​నాథ్​

ఈ మూడు రాష్ట్రాలు ఒక ఎత్తు అయితే.. తెలంగాణ మరో ఎత్తు. మిగిలిన రాష్ట్రాల్లో నేరుగా బీజేపీ ఎదుర్కొంటే.. ఇక్కడ మాత్రం బీఆర్​ఎస్​తో పోటీ పడాల్సి ఉంటుంది. మరోవైపు బీఆర్ఎస్​కు తామే ప్రత్యర్థిగా చెప్పుకునే రాష్ట్ర బీజేపీతోనూ పోటీపడాల్సి ఉంటుంది. తెలంగాణ ఇచ్చి కూడా ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ విఫలమైంది. దానికి తోడు సీనియర్లు అలకతోనూ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలోనే పార్టీలో చేరి.. టీపీసీసీగా బాధ్యతలు చేపట్టిన రేవంత్​ రెడ్డితో.. వారంతా ఏకిభవించట్లేదు. అడపాదడపా సమావేశాల్లో కలిసి మాట్లాడుతున్నప్పటికీ.. సందర్భం వచ్చినప్పుడు విభేదాలు బయటపడుతునే ఉన్నాయి.

రేవంత్ రెడ్డి

తెలంగాణపై ప్రత్యేక ఫోకస్​ చేసిన ప్రియాంక గాంధీ.. ఇక్కడ భారీ సభ ఏర్పాటు చేసి నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఆ కుటుంబాలకు రూ.25,000 పెన్షన్ అందిస్తామన్నారు. నిరుద్యోగులకు రూ.4వేల జీవన భృతి కల్పిస్తామన్నారు. 18 ఏళ్ల పైబడిన యువతులకు ఈ స్కూటర్లు అందిస్తామని ప్రియాంక వెల్లడించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికలు ఇచ్చిన జోష్​ను ఏ విధంగా ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందనేది చూడాల్సి ఉంది.

ప్రియాంక గాంధీ
Last Updated : May 13, 2023, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details