తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకలో 200కేజీల వెండి సీజ్.. స్టార్ నిర్మాత కారులో తరలిస్తూ.. - బోనీ కపూర్ కారు సీజ్

కర్ణాటకలో బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌కు చెందిన కారులో వెండి వస్తువులను అధికారులు సీజ్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. బీదర్​లోనూ దాదాపు రూ. కోటి విలువైన వెండి వస్తువులను అధికారులు సీజ్ చేశారు.

ec seized silver anklets karnataka
ec seized silver anklets karnataka

By

Published : Apr 8, 2023, 3:48 PM IST

శాసనసభ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో భారీ స్థాయిలో నగదు, విలువైన ఆభరణాలు పట్టుబడుతున్నాయి. దావణగెరె తాలూకాలోని హెబ్బెలు టోల్ సమీపంలో ఓ BMW కారులో 66 కేజీల వెండి వస్తువులను ఈసీ అధికారులు సీజ్‌ చేశారు. వెండి గిన్నెలు, స్పూన్లు, ప్లేట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిని ఐదు బాక్సుల్లో చెన్నై నుంచి ముంబయి తరలిస్తున్నట్లు వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.39లక్షల పైనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ కారు బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థపై రిజిస్టరై ఉన్నట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు. కారులో ఉన్న హరి సింగ్‌ను విచారించగా.. ఆ వస్తువులు బోనీ కపూర్‌ కుటుంబానికి చెందినవేనని చెప్పినట్లు తెలుస్తోంది. సరైన పత్రాలు చూపించనందుకే వీటినీ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

కర్ణాటకలో మే నెలలో శాసనసభ ఎన్నికల జరగనున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు పెంచింది. చెక్​పోస్టులు వద్ద పాయింట్​లను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈసీ అధికారులు. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి కర్ణాటకలోకి అనుమతిస్తున్నారు. మరోవైపు.. బీదర్​లోని వనమారాపల్లి చెక్‌పోస్టు వద్ద ఓ కారులో భారీ మొత్తంలో వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.కోటి ఉంటుందని అంచనా వేశారు. కారులో తరలిస్తున్న వస్తువులకు సరైన పత్రాలు లేకపోవడం వల్ల సీజ్​ చేశామని తెలిపారు.

'కారులో దాదాపు 140 కిలోల బరువున్న వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. ఇవన్నీ బస్తాల్లో పెట్టి కారులో తరలిస్తున్నారు. కారు యజమాని ఈ వెండి వస్తువులకు సంబంధించి పత్రాలు ఇవ్వలేదు. అందుకే వీటిని స్వాధీనం చేసుకున్నాం. అనిల్, గజానన్, రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం.'
--ఈసీ అధికారులు

పోలీసులు స్వాధీనం చేసుకున్న వెండి వస్తువులు
పోలీసులు స్వాధీనం చేసుకున్న వెండి వస్తువులు

రాష్ట్రవ్యాప్తంగా చెక్​పోస్ట్​లు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బులు, వస్తువులు పంచుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసీ దీనిపై ప్రధానంగా దృష్టిపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు.

కిచ్చా సుదీప్ సినిమాలపై బ్యాన్​!..
ఇదిలా ఉండగా.. కర్ణాటకలో సినీతారలపై రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కొద్ది రోజుల క్రితం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యేవరకు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ సినిమాలు, షోలు, వ్యాపార ప్రకటనలపై నిషేధం విధించాలని ఈసీకి లేఖ రాసింది జేడీఎస్. లేకపోతే సుదీప్ సినిమాలు, ప్రకటనలు కన్నడ ఓటర్లపై ప్రభావం చూపుతాయని పేర్కొంది. ఇదే విషయంపై శివమెుగ్గకు చెందిన లాయర్‌ కేపీ శ్రీపాల్‌ కూడా ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు.

ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైతో కలిసి ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించిన కిచ్చా సుదీప్‌.. తాను ఏ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. అదే సమయంలో శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తానని.. పోటీ మాత్రం చేయబోనని వెల్లడించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తనకు చిన్నప్పటి నుంచి తెలుసని ఆయనకే తన మద్దతు అని ప్రకటించారు. అలాగే తనకు అండగా నిలిచిన వారి తరఫున పని చేస్తానని తెలిపారు

కర్ణాటకలో మే 10న శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. 224 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నువ్వా-నేనా స్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. జేడీఎస్​ కూడా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details