తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్​.. కాంగ్రెస్​ గూటికి మాజీ సీఎం శెట్టర్​

కర్ణాటకలో కాషాయ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం జగదీశ్ శెట్టర్​ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. తాను నిర్మించిన పార్టీ నుంచి తననే బలవంతంగా గెంటేశారని శెట్టర్ విమర్శించారు.

karnataka election 2023
karnataka election 2023

By

Published : Apr 17, 2023, 9:43 AM IST

Updated : Apr 17, 2023, 10:48 AM IST

కర్ణాటకలో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత జగదీశ్ శెట్టర్​ కాంగ్రెస్​లో చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జగదీశ్ శెట్టర్​ హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్​, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ ఇంఛార్జ్ రణ్​దీప్ సుర్జేవాలా పాల్గొన్నారు. ఆదివారం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి జగదీశ్ షెట్టర్​ రాజీనామా చేశారు. అసెంబ్లీ సీటు నిరాకరించడం వల్ల శెట్టర్​ బీజేపీని వీడారు.

కాంగ్రెస్​లో చేరిన అనంతరం జగదీశ్ శెట్టర్​ మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో బీజేపీని బలపరిచేందుకు పార్టీ కార్యకర్తగా నిరంతరం శ్రమించానని అన్నారు. మనస్పూర్తిగానే కాంగ్రెస్​లో చేరుతున్నానని తెలిపారు. బీజేపీ ప్రస్తుతం కొందరి నియంత్రణలో ఉందని విమర్శించారు. తాను నిర్మించిన పార్టీ నుంచి తననే బలవంతంగా గెంటేశారని శెట్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్​లో చేరిన జగదీశ్ శెట్టర్

'ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన తాను కాంగ్రెస్​ చేరడం కొందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. బీజేపీ నాకు ప్రతి పదవి ఇచ్చింది. పార్టీ కార్యకర్తగా బీజేపీ ఎదుగులదలకు నిరంతరం శ్రమించా. పార్టీ సీనియర్​ నాయకుడినైన నాకు టికెట్​ వస్తుందని ఆశించా. కానీ బీజేపీ అధిష్ఠానం టికెట్ నిరాకరించింది. ఒక్కసారి షాక్​కు గురయ్యాను. నాతో పార్టీ పెద్దలు కనీసం కనీసం చర్చలు కూడా జరపలేదు. మనస్పూర్తిగా కాంగ్రెస్‌లో చేరుతున్నాను. కేపీసీసీ చీఫ్​ డీకే శివకుమార్, కాంగ్రెస్ కర్ణాటక ఇంఛార్జ్​ రణదీప్ సూర్జేవాలా, కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య , ఎంబీ పాటిల్ సహా పలువురు నేతలు నన్ను సంప్రదించారు. కాంగ్రెస్​లో చేరాలని ఆహ్వానించారు. అందుకే కాంగ్రెస్​ పార్టీలో చేరాను.'
--జగదీశ్ శెట్టర్, మాజీ ముఖ్యమంత్రి

జగదీశ్ శెట్టర్ చేరిక కాంగ్రెస్​లో మరింత ఉత్సాహాన్ని పెంచుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. శెట్టర్​.. తాను గెలవడమే కాకుండా.. మరికొందరిని గెలిపించగల సామర్థ్యం ఉన్న నేత అని కొనియాడారు. మరోవైపు.. జగదీశ్ శెట్టర్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని కాంగ్రెస్ అగ్రనేత సిద్ధరామయ్య అన్నారు. రాష్ట్రంలో శెట్టర్​కు మంచి రాజకీయ నాయకుడిగా పేరుందని అన్నారు. 'ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తి అయినప్పటికీ సెక్యులర్‌ భావాలు ఉన్న వ్యక్తి శెట్టర్​. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శెట్టర్​ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ సమయంలో ఆయనతో కలిసి పనిచేశా. శెట్టర్​.. బీజేపీలో నిజాయతీ గల వ్యక్తి. ఆ పార్టీకి ఎల్లప్పుడూ అండగా నిలిచారు. జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్​లో చేరడం వల్ల 150కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తాం. రాష్ట్రంలో లింగాయత్​ కమ్యూనిటీకి చెందిన నాయకులను బీజేపీ అవమానిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు. ఆ సమయంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. అలాగే ఇప్పుడు మరో నేత జగదీశ్ శెట్టర్​కు టికెట్ కేటాయించకుండా ఇబ్బంది పెట్టారు' అని సిద్ధరామయ్య అన్నారు.

కాంగ్రెస్​లో చేరిన జగదీశ్ శెట్టర్

భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన జగదీశ్‌ శెట్టర్‌.. హుబ్బళ్లి-ధార్వాడ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉత్తర కర్ణాటకలో ఆయన బలమైన నేత. బీజేపీ అధిష్ఠానం ఆయన వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదు. దీంతో ఆయన సోమవారం కాంగ్రెస్ గూటికి చేరారు. హుబ్బళ్లి-ధార్వాడ టికెట్​ను జగదీశ్ శెట్టర్​కు కాంగ్రెస్ కేటాయించింది. పార్టీలో చేరిన వెంటనే కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్​.. జగదీశ్ శెట్టర్​కు బీ ఫామ్ అందించారు.

జగదీశ్ శెట్టర్​కు బీ ఫామ్ ఇస్తున్న కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్

కర్ణాటకలో 224 శాసనసభ స్థానాలకుగానూ ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మే 10న పోలింగ్ జరగనుండగా.. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నువ్వా-నేనా అన్న రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

Last Updated : Apr 17, 2023, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details