తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా.. పోలింగ్, కౌంటింగ్ తేదీలివే..

కర్ణాటక ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

karnataka election 2023 date
karnataka election 2023 date

By

Published : Mar 29, 2023, 12:08 PM IST

Updated : Mar 29, 2023, 12:44 PM IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. మే 10న రాష్ట్ర అసెంబ్లీకి ఎలక్షన్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మే 13న ఎన్నికల ఫలితం వెలువడుతుందని ప్రకటించింది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్​లో బుధవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన అధికారులు ఈ మేరకు ప్రకటన చేశారు.

కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా.. పోలింగ్, కౌంటింగ్ తేదీలివే..
  • నోటిఫికేషన్ విడుదల తేదీ : 2023 ఏప్రిల్ 13
  • నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: ఏప్రిల్ 20
  • నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 21
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 24
  • కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: మే 10
  • కర్ణాటక ఎన్నికల ఫలితాల తేదీ : మే 13
  • కర్ణాటక అసెంబ్లీ నియోజకవర్గాలు : 224
  • కర్ణాటక ఓటర్ల సంఖ్య : 5 కోట్ల 21 లక్షల 73 వేల 579
  • పోలింగ్ కేంద్రాల సంఖ్య : 58,282
  • మహిళా సిబ్బంది ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాలు : 1,320
  • 80ఏళ్లు పైబడ్డ ఓటర్ల సంఖ్య : 12.15 లక్షలు
  • 2018-19తో పోల్చితే 9.17లక్షల మేర పెరిగిన తొలిసారి ఓటర్ల సంఖ్య.
  • మే 24తో ముగియనున్న ప్రస్తుత అసెంబ్లీ గడువు.

డబుల్​ ఇంజిన్ నినాదంతో బీజేపీ..
ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. దక్షిణ భారతదేశంలో కమలనాథులకు సొంతంగా ప్రభుత్వం ఉన్న రాష్ట్రం ఇదొక్కటే. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు బసవరాజ్ బొమ్మై సర్కారుకు అవరోధాలుగా నిలుస్తున్నాయి. అయితే, డబుల్ ఇంజిన్ నినాదం, ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. కన్నడ భాషకు ప్రాధాన్యం, స్థానికత అంశాన్ని ఎన్నికల్లో లేవనెత్తుతోంది. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకే ప్రభుత్వం నుంచి మినహాయింపులు ఇస్తామని గతేడాది స్పష్టం చేసింది. కన్నడ భాషాభివృద్ధి కోసం బిల్లును సైతం ఆమోదించింది.

బొమ్మై, బీఎస్ యడియూరప్ప హయాంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెబుతూ ఓట్లు అడుగుతోంది బీజేపీ. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పాలనాపరమైన నిర్ణయాలు సైతం వేగంగా తీసుకుంటోంది. ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లను తొలగించి.. వొక్కలిగ, లింగాయత్ వర్గాలకు సమానంగా పంచాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఎన్నికల తేదీ ప్రకటన తర్వాతే బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుందని ముఖ్యమంత్రి బొమ్మై ఇటీవల వెల్లడించారు.

కాంగ్రెస్ పరిస్థితి ఇలా..
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కంకణం కట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే సగానికి పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. కీలక సామాజిక వర్గాలైన లింగాయత్, వొక్కలిగలకు సీట్ల కేటాయింపులో పెద్ద పీట వేసింది. దళితులు, ఆదివాసీలకు సైతం ప్రాధాన్యం ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే.. బీజేపీ సర్కారు రద్దు చేసిన మైనారిటీ రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

జేడీఎస్ సంగతి?
రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండనుంది. ఈ రెండు పార్టీల మధ్య జనతాదళ్ (సెక్యులర్) తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. వొక్కలిగల ఓట్లు దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. పాత మైసూరు ప్రాంతంలో జేడీఎస్ ఆధిపత్యానికి గండి కొట్టాలని భావిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య జేడీఎస్ ఏ మేరకు రాణిస్తుందనేది చూడాల్సి ఉంది.

గాలి సత్తా ఎంత?
ఈ ఎన్నికల్లో ఓ కొత్త పార్టీ సైతం బరిలో నిలిచింది. వివాదాస్పద మైనింగ్ దిగ్గజం గాలి జనార్దన రెడ్డి.. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రధానంగా కల్యాణ కర్ణాటక (హైదరాబాద్- కర్ణాటక) ప్రాంతంలోనే ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన రాజకీయాలు మొత్తం బీజేపీ లక్ష్యంగానే సాగుతున్నాయి. 2018 ఎన్నికల్లో హైదరాబాద్- కర్ణాటక ప్రాంతంలోని 19 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ సమీకరణాన్ని మార్చేయాలని గాలి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో ఇలా..
కర్ణాటకలో ప్రస్తుతం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్​ 75, జేడీఎస్​ 28 స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. 2018 ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు గెలవగా.. కాంగ్రెస్ 80, జేడీఎస్ 37 సీట్లలో విజయం సాధించింది. రాష్ట్రంలో తొలుత కాంగ్రెస్- జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అనంతరం జరిగిన నాటకీయ పరిణామాలతో రాష్ట్ర రాజకీయం మారిపోయింది. 16 మంది ఎమ్మెల్యేలు జేడీఎస్​కు రాజీనామా చేయగా.. రాష్ట్రంలో కమలనాథుల సర్కారు ఏర్పడింది.

నోట్లు విసిరిన కాంగ్రెస్ చీఫ్
ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు.. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ చేసిన పని వివాదాస్పదమైంది. మంగళవారం మండ్య జిల్లాలోని బెవినహళ్లి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. కళాకారులపై 500 రూపాయల నోట్లు విసరడం కెమెరాకు చిక్కింది. దీనిపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను కాంగ్రెస్ యాచకులని భావిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు డీకే శివకుమార్ ఏ పనైనా చేస్తారని ధ్వజమెత్తారు. ప్రజలే వారికి బుద్ధి చెబుతారన్నారు.

ఇదీ చదవండి:

'శత్రువులను ఫుట్​బాల్​లా ఆడుకుంటా'.. పార్టీ గుర్తు, మేనిఫెస్టో ప్రకటించిన గాలి జనార్ధన్​ రెడ్డి

యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి.. టైర్లకు నిప్పంటించి విసిరిన బంజారాలు

Last Updated : Mar 29, 2023, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details