Karnataka Congress Schemes : కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయానికి దోహదం చేసిన ఐదు ఉచిత హామీల అమలుకు సిద్ధరామయ్య ప్రభుత్వం.. తొలి కేబినెట్ సమావేశంలోనే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వాటి అమలుకు ఏటా రూ.50,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. శనివారం ఉదయం.. కొత్త సీఎంగా సిద్ధరామయ్య, ఏకైక డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎనిమిది మంది మంత్రులతో తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది సిద్ధూ ప్రభుత్వం. అనంతరం సిద్ధరామయ్య మీడియా సమావేశం నిర్వహించి పలు వివరాలు తెలిపారు.
Congress Five Guarantees : "మేనిఫెస్టోలో 5 హామీలు ఇచ్చాం. మొదటి కేబినెట్ సమావేశంలోనే వాటి అమలుపై చర్చించి, ఆదేశాలు ఇచ్చాం. వారం రోజుల్లో మరో కేబినెట్ సమావేశం నిర్వహించి వాటికి ఆమోదం తెలుపుతాం. ఆర్థికపరమైన చిక్కులు వచ్చినప్పటికీ.. కన్నడ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. మా ప్రభుత్వం సంవత్సరానికి రూ.50,000 కోట్లు.. ఐదు హామీల కోసం ఖర్చు చేయడం అసాధ్యమని నేను అనుకోను. అప్పుల ఊబిలో కూరుకుపోకుండా అన్ని పథకాలను అమలు చేస్తామన్న విశ్వాసం మాకు ఉంది. రాష్ట్ర రుణానికి వడ్డీగా రూ.56,000 కోట్లు చెల్లిస్తున్నప్పుడు.. మన ప్రజల కోసం రూ.50,000 కోట్లు ఖర్చు చేయలేమా?" అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. జులైలో రూ.3.25 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెడతామని సిద్ధరామయ్య తెలిపారు.
కాంగ్రెస్ ప్రకటించిన 5 హామీలు
- గృహ జ్యోతి: కర్ణాటకలోని ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
- గృహ లక్ష్మి: కుటుంబ పెద్దగా ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెల రూ.2,000
- అన్న భాగ్య: దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ప్రతి నెల 10 కిలోల బియ్యం
- యువ నిధి: నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ప్రతి నెల రూ.3,000 భృతి, డిప్లోమా ఉండి ఉద్యోగం లేని వారికి ప్రతి నెల రూ.1,500.
- శక్తి: కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో ఆర్డినరీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయొచ్చు