Congress Five Guarantees : కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయానికి దోహదం చేసిన ఐదు ఉచిత హామీల అమలుకు సిద్ధరామయ్య కేబినెట్ అమోదం తెలిపింది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం మంత్రివర్గ సమావేశం తర్వాత తెలిపారు. కులం, మతం అనే తారతమ్యం లేకుండా ఐదు ఉచిత హామీలను ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.
Karnataka Congress Promises : జులై 1 నుంచి గృహ జ్యోతి పథకం (ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం) అమలు అవుతుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. జులై వరకు కరెంట్ బిల్లులు ప్రజలు చెల్లించాల్సిందేనని తెలిపారు. అన్న భాగ్య పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల బియ్యం అందిస్తామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. 'శక్తి' పథకం కింద కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో ఆర్డినరీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని అన్నారు. అలాగే 'యువ నిధి' పథకం కింద నిరుద్యోగ పట్టభద్రులకు రూ.3 వేలు.. 2022-23లో పాసై.. నిరుద్యోగులుగా ఉన్న డిప్లొమా విద్యార్థులకు రూ.1,500.. 24 నెలల పాటు అందజేస్తామని సిద్ధరామయ్య ప్రకటించారు.
Congress Guarantee In Karnataka : 'గృహ లక్ష్మి' పథకం కింద కుటుంబ పెద్దగా ఉన్న ప్రతి మహిళకు ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ప్రతి నెల రూ.2,000 అందిస్తామని సిద్ధరామయ్య తెలిపారు. ఈ పథకం కోసం అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేస్తుకోవాలని సూచించారు. జూన్ 15న ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభమై.. జూలై 15న ముగుస్తుందని సిద్ధరామయ్య చెప్పారు. దరఖాస్తు సమయంలో లబ్ధిదారులు తమ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.