తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యడ్డీ నిష్క్రమణపై సాయంత్రం స్పష్టత! - యడియూరప్ప ఎన్నిసార్లు సీఎం అయ్యారు?

కర్ణాటక అధికార పార్టీలో నాయకత్వ మార్పు, ముఖ్యంగా యడియూరప్పను సీఎం కుర్చీ నుంచి తొలగిస్తారని ఏడాది కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం అని ఆయన ప్రకటించేశారు. రాజీనామా చేయాలని అధిష్ఠానం సూచిస్తే తన నిష్క్రమణపై సోమవారం కీలక ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు 'ఆదివారం సాయంత్రంలోగా పార్టీ అధిష్ఠానం నుంచి సలహా వస్తుందని ఆశిస్తున్నా' అని ఆయన వ్యాఖ్యానించడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.

yadyurappa
యడియూరప్ప

By

Published : Jul 25, 2021, 11:55 AM IST

Updated : Jul 25, 2021, 12:14 PM IST

కన్నడనాట అర్ధ శతాబ్దానికి పైగా రాజకీయాలను శాసించిన బి.ఎస్‌.యడియూరప్ప జీవితంలో ఆదివారం అత్యంత కీలకంగా మారనుంది. తన రాజీనామాపై విస్తృత స్థాయిలో వ్యాపించిన వదంతుల నడుమ గురువారం ఆయన ఓ కీలక ప్రకటనే చేశారు. అధిష్ఠానం నుంచి ఆదివారం అందే సూచనపైనే నా భవిష్యత్తు ఆధారపడుతందని ఆయన వెల్లడించడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఆయన అంచనా ప్రకారం పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి రాజీనామాపై ఆదివారమే స్పష్టత ఇవ్వనున్నారు. రాజీనామా చేయాలని అధిష్ఠానం సూచిస్తే సోమవారం నిర్వహించే సర్కారు రెండేళ్ల విజయోత్సవ కార్యక్రమంలో తన నిష్క్రమణపై ప్రకటన చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధమవుతారు.

"సాయంత్రంలోగా పార్టీ అధిష్ఠానం నుంచి సలహా వస్తుందని ఆశిస్తున్నా. అదెంటో మీరూ (మీడియా) తెలుసుకుంటారు. దళిత సీఎం నియామకంపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఆందోళన చెందను."

-బి.ఎస్.యడియూరప్ప, కర్ణాటక సీఎం

అడుగడుగునా ఆటుపోట్లు..

ఎన్నో పోరాటాల అనంతరం 2019 జులై 26న నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బి.ఎస్‌.యడియూరప్ప ఈ రెండేళ్లు రాజీనామా వదంతులు, ప్రకృతి వైపరీత్యాలతో సహవాసం చేశారు. ఇప్పటికే మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా.. నాలుగోసారి ప్రయాణం అంత సజావుగా సాగలేదు. భాజపా, జేడీఎస్‌ నుంచి రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేల అండతో అధికారాన్ని అందుకున్నా.. వారి కారణంగానే పార్టీ కంట్లో నలుసుగా మారారు. వలస నేతలందరికీ పదవులు కట్టబెట్టిన ముఖ్యమంత్రి సహజంగానే పార్టీ విధేయులకు దూరమయ్యారు. రెండుసార్లు మంత్రివర్గాన్ని విస్తరించినా సీనియర్లకు ప్రాధాన్యం నాస్తీ. ఈ కారణంగా సొంత ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తిరుగుబాటు బావుటా ఎగురువేసి చివరకు ముఖ్యమంత్రి పీఠాన్ని కదలించే స్థాయికి చేరారు. తన అండదండలు, సహకారంతో పార్టీలో ఎదిగిన వారు నేడు ముఖ్యమంత్రికి బద్ద శత్రువులుగా మారారు. యడియూరప్ప లేనిదే భాజపా లేదని అన్నవారు కాస్తా.. ఆయనే పార్టీకి అడ్డంకిగా మారారని దుష్ప్రచారం చేశారు. కుమారుడు బి.వై.విజయేంద్ర అక్రమాలను అడ్డుకోలేని ముఖ్యమంత్రితో సర్కారుకు తలవంపులు తప్పవని అధిష్ఠానం వద్ద పదేపదే ఫిర్యాదు చేస్తూ చివరకు అన్నంత పని చేశారు.

వయసే భారమా?

ముఖ్యమంత్రికి.. 78 సంవత్సరాల వయసే ప్రధాన శత్రువుగా మారింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఆయన వయసు 76 సంవత్సరాలు. పార్టీ నిబంధనల ప్రకారం 75 ఏళ్లు దాటితే ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం కావాలి. రాష్ట్రంలో భాజపా ప్రగతికి మార్గదర్శకుడైన యడియూరప్పను అధిష్ఠానం గౌరవించింది. ఆ గౌరవంతోనే రెండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరించింది. సరిగ్గా ఇదే అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి తాను అధిష్ఠాన నిర్ణయాన్ని గౌరవించి.. సూచనలను పాటిస్తానని ఇటీవల ప్రకటించారు. వాస్తవానికి వయసు మళ్లినా ముఖ్యమంత్రి యడియూరప్ప ఎంతో చురుకుగా పని చేశారు. రెండేళ్ల కాలంలో రెండు సార్లు కరోనా బారిన పడినా.. కోలుకుని యువ నేతలకు పోటీగా పని చేశారు. 2019 జులై 26న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుల వ్యవధిలోనే వరదలు చుట్టుముట్టాయి. అప్పటికీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయని ముఖ్యమంత్రి ఒంటరిగానే వరద ప్రాంతాలను సందర్శించారు. 2020లోనే జులై ఆగస్టు, సెప్టెంబరు మధ్య కాలంలో మరోమారు అతివృష్టి, తాజాగా మరింత భీభత్సకరమైన వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భాల్లో ముఖ్యమంత్రి ఎంతో చురుకుగా జిల్లాలను చుట్టేశారు. ప్రజలకు అండగా ఉన్నానన్న భరోసా ఇచ్చారు. 2020 మార్చిలో మొదలైన కరోనా తీవ్రత నేటికీ తగ్గలేదు. వయసు మళ్లినా ఏనాడూ విశ్రమించని ఆయన.. కరోనా నియంత్రణలో ఉత్తమ పాలన అందించినట్లు అధిష్ఠానమే పలుమార్లు కితాబిచ్చింది. రాష్ట్రాన్ని సందర్శించిన ప్రతిసారీ పార్టీ బాధ్యుడు అరుణ్‌సింగ్‌ కూడా క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి యడియూరప్ప భేషుగ్గా పని చేసినట్లు కొనియాడారు. వయసు కార్డుతో ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేందుకు సిద్ధం కావడమే రాజకీయం.

ఇదీ చదవండి:నాయకత్వ మార్పుపై యడియూరప్ప కీలక వ్యాఖ్యలు

వరదలు వరమేనా?

ముఖ్యమంత్రి యడియూరప్ప ఆదివారం బెళగావిలో పర్యటించనున్నారు. భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న ఉత్తర కర్ణాటక ప్రాంతాలను ఆయన చుట్టేస్తారు. అదే సమయానికి.. అధిష్ఠానం నుంచి ఆయన రాజీనామాపై స్పష్టమైన సూచనలు అందనున్నాయి. నిజానికి ఈ పర్యటన తనకెంతో ఊరటనిస్తుందని అప్ప భావిస్తున్నారు. రాష్ట్రంలోని 12 జిల్లాలు వరద తాకిడితో తల్లడిల్లుతున్నాయి. ముఖ్యమంత్రి నేతృత్వంలో రక్షణ చర్యలు చేపట్టాల్సిన సమయంలో కేంద్ర సర్కారూ చేయూతనివ్వాలి. వరద పరిహారం కోసం నిధులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సమకూర్చాల్సిన కేంద్రం.. ఈ పరిస్థితుల్లో నాయకత్వ మార్పు సాహసం చేయదనే వాదన మొదలైంది. ఈ పరిస్థితుల్లో రాజకీయాలపై దృష్టి సారిస్తే అదెంతో తప్పిదమవుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఆదివారం తన రాజకీయ ప్రస్థానానికి చివరి రోజని తెలిసినా ముఖ్యమంత్రి వరద ప్రాంతాలను సందర్శించటం ఆసక్తి కల్గిస్తోంది. చివరి నిమిషం వరకు తాను కష్టపడుతున్నా.. అధిష్ఠానం గుర్తించలేదన్న సందేశాన్ని పంపేందుకు ఈ పర్యటన చేపట్టారని మరో వాదన.

సవాళ్లెదురైనా సై!

ఇదీ చదవండి:కీలక భేటీల రద్దు.. యడియూరప్ప రాజీనామా ఎప్పుడు?

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచీ సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని ఎంతో గట్టిగా ఎదుర్కోవటం సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. శనివారం దృశ్య మాధ్యమం ద్వారా శివమొగ్గ జిల్లాలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన శివమొగ్గ జిల్లా అభివృద్ధికి చేసిన సేవలు సంతృప్తి ఇచ్చాయన్నారు. శికారిపుర పురసభ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం చేపట్టిన పనులతో వారి రుణం తీర్చుకున్నట్లు ప్రకటించారు. నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందన్నారు. రూ.384 కోట్లతో విమానాశ్రయాన్ని నిర్మించి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేస్తున్నామన్నారు. కరోనా, వరదల రూపంలో రెండేళ్లలో పెను సవాళ్లు ఎదురయ్యాయి. ప్రజల బతుకులు అస్తవ్యస్తమైనా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచే ప్రయత్నం చేశానన్నారు. ప్రజల సహకారంతోనే సవాళ్లను సులువుగా ఎదుర్కొన్నానని వివరించారు. ఈ సందర్భంగా రూ.1,074కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై జిల్లా పాలనాధికారులతో మాట్లాడారు.

వర్చువల్‌ వేదికపై శివమొగ్గ జిల్లాలో అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో యడియూరప్ప

మరో వ్యాజ్యం..

ముఖ్యమంత్రి యడియూరప్ప, ఆయన చిన్న కుమారుడు బి.వై.విజయేంద్ర, బంధువులు కలిసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సహ కార్యకర్త టి.జె.అబ్రహం దాఖలు చేసిన కేసును చట్టసభ ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఇప్పటికే కొట్టివేసింది. ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ అబ్రహం ఉన్నత న్యాయస్థానంలో తాజాగా మరో పిటిషన్‌ దాఖలు చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా గవర్నర్‌ అనుమతి లేకుండానే కేసు దాఖలు చేశారని దిగువ న్యాయస్థానం పేర్కొంది. తాను ఆధారాలతో సహా దాఖలు చేసిన వ్యాజ్యం విచారణకు అర్హమైనదంటూ తాజాగా వేసుకున్న కేసు వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఇవీ చదవండి:

Last Updated : Jul 25, 2021, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details