కర్ణాటకలో నాయకత్వ మార్పులు జరుగుతాయనే ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి యడియూరప్ప ఆకస్మిక దిల్లీ పర్యటన దీనికి మరింత ఊతమిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో సీఎం యడియూరప్ప హస్తినకు బయల్దేరి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితర ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. పార్టీ నాయకత్వ మార్పుపై చర్చించేందుకే అధిష్ఠానం యడ్డీని దిల్లీకి పిలిపించినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు అరుణ్ సింగ్ ఇటీవల కర్ణాటకలో పర్యటించారు. పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలతోనూ భేటీ అయ్యారు. ఈ క్రమంలో సీఎంపై వ్యతిరేకత వ్యక్తమైనట్లు సమాచారం. ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో సీఎం తనయుడి జోక్యం ఎక్కువైపోతోందని, ఫలితంగా ప్రభుత్వ పనితీరుపై ప్రభావం పడుతోందని ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం యడియూరప్పతో మాట్లాడి.. నిర్ణయం తీసుకునేందుకే ఆయన్ను దిల్లీకి పిలిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.