తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎటూ తేలని 'కర్ణాటక సీఎం' ఎంపిక.. ఖర్గే చేతికి బాధ్యతలు.. గురువారమే ప్రమాణ స్వీకారం? - Karnataka CM

కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. కాంగ్రెస్​ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతికి సీఎం ఎంపిక బాధ్యతలను కొత్త ఎన్నికైన ఎమ్మెల్యేలు అప్పగించారు.

Karnataka CM
Karnataka CM

By

Published : May 14, 2023, 9:54 PM IST

Updated : May 14, 2023, 10:08 PM IST

Karnataka CM : కర్ణాటకలో కాంగ్రెస్‌ అఖండ విజయంతో నూతన ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ వీడలేదు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మధ్య సీఎం పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొనడం వల్ల.. సీఎం అభ్యర్థిని అధిష్ఠానమే నిర్ణయించాలంటూ సీఎల్​పీ సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేశారు.

కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సమావేశం ఆదివారం సాయంత్రం బెంగళూరులోని ఓ ప్రముఖ హోటల్​లో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ఏక వాక్య తీర్మానం చేశారు. ఈ సమావేశానికి కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తోపాటు మాజీ సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. ఏఐసీసీ పరిశీలకులుగా సుశీల్ కుమార్ శిందే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియా హాజరయ్యారు.

సీఎల్​పీ మీటింగ్​లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్​

ఈ క్రమంలోనే సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతో కాంగ్రెస్‌ పరిశీలకులు ప్రత్యేకంగా భేటీ అయి చర్చించారు. నిర్ణయం ఎవరికి అనుకూలంగా వచ్చినా, పార్టీలో చీలిక రాకుండా మరోవర్గం వారు సహకరించాలని వారికి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. అయితే, అధిష్ఠానం సుదీర్ఘ అనుభవం కలిగిన సిద్ధరామయ్యకు మళ్లీ సీఎంగా ఛాన్స్‌ ఇస్తుందా? లేదంటే తన వ్యూహాలతో కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేర్చిన డీకే శివకుమార్‌కు అవకాశం ఇస్తుందా?అనే అంశం ఆసక్తిగా మారింది.

సీఎల్​పీ మీటింగ్​కు హాజరైన కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు

"సీఎల్​పీ లీడర్​ను నియమించడానికి ఏఐసీసీ అధ్యక్షుడికి అధికారం ఇస్తూ సింగిల్​ లైన్​ తీర్మానాన్ని సిద్ధరామయ్య ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని 135 మంది ఎమ్మెల్యేలు సహా డీకే శివకుమార్​ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానం ప్రవేశపెట్టిన విషయాన్ని కాంగ్రెస్​ జనరల్​ సెక్రటరీ కేసీ వెనుగోపాల్​.. కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు తెలియజేశారు. ప్రతి శాసనసభ్యుడి వ్యక్తిగత అభిప్రాయాలను తెలుసుకుని వాటిని హైకమాండ్​కు తెలియజేయాలని ముగ్గురు సీనియర్​ పరిశీలకులకు ఖర్గే ఆదేశించారు" అని కర్ణాటక ఏఐసీసీ ఇన్​ఛార్జి రణ్​దీప్​ సూర్జేవాలా తెలియజేశారు.

"ఆదివారం రాత్రికే ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకునే ప్రక్రియ పూర్తి కానుంది. రణదీప్ సింగ్ సూర్జేవాలా చెప్పినట్లుగా.. సిద్ధరామయ్య ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డీకే శివకుమార్​తోపాటు సీనియర్ నాయకులందరూ మద్దతు ఇచ్చారు" అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.

గురువారం ప్రమాణస్వీకారం?
కర్ణాటక కొత్త సీఎం, కేబినెట్‌ మంత్రులు గురువారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తదితరులు హాజరుకానున్నారు. అలాగే, భావసారుప్యత కలిగిన పార్టీలకు సైతం కాంగ్రెస్‌ ఆహ్వానాలు సైతం పంపిస్తున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక మంత్రివర్గం కూర్పునకు ఒకట్రెండు రోజుల్లో తుది రూపం వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

సీఎం అభ్యర్థి విషయంలో వివాదంలేదు: ఖర్గే
కర్ణాటకలో పరిణామాలపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వం కోసమే కాంగ్రెస్‌కు ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపేందుకు కృషిచేస్తామని చెప్పారు. సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు పరిశీలకులను అధిష్ఠానం పంపిందని.. సీఎం అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో సరైన నిర్ణయమే తీసుకుంటామన్నారు. సీఎం అభ్యర్థి విషయంలో ఎలాంటి వివాదం లేదని ఆయన స్పష్టంచేశారు.

సిద్ధ X డీకే..
సీఎం పీఠం దక్కించుకొనేందుకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా హరిహరపుర మఠానికి చెందిన వక్కళిగ సాధువులు డీకేఎస్‌ ఇంటికి వచ్చి ఆయన్ను కలిశారు. మరోవైపు, తుముకూరులోని సిద్ధేశ్వర మఠాన్ని డీకేఎస్‌ కుటుంబ సమేతంగా సందర్శించి ఆశీస్సులు తీసుకున్నారు. సీఎల్పీ భేటీకి ముందు మఠాన్ని సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిద్ధరామయ్య ఖర్గే నివాసానికి వెళ్లి కలిశారు. అయితే, ఇది రాజకీయ సమావేశం కాదని ఖర్గే తనయుడు ప్రియాంక్‌ ఖర్గే తెలిపారు. సీఎల్పీ సమావేశంలోనే సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తారని తెలిపారు.

Karnataka Election Results : 224 స్థానాలు ఉన్న కర్ణాటక శాసనసభకు ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 135 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. భారతీయ జనతా పార్టీకి 66 సీట్లు, మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్‌ 19 స్థానాలు గెలుపొందాయి.

Last Updated : May 14, 2023, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details