తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటక సీఎం పీఠంపై వీడని సస్పెన్స్​.. ఖర్గేతో సిద్ధరామయ్య, డీకే భేటీ.. ఆ రోజే నిర్ణయం! - సిద్ధరామయ్య సీఎం పదవి వార్తలు

Karnataka CM : కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ తనకు తల్లి లాంటిదని, వెన్నుపోటు పొడవబోనని, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడనని హస్తినకు వెళ్లటానికి ముందు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు కారణమని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. అయితే సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ్య, శివకుమార్‌లు కూడా పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో విడివిడిగా భేటీ అయ్యారు. కాగా, కాంగ్రెస్‌ అ‍ధిష్ఠానం సిద్ధరామయ్య వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం ఎంపికపై పార్టీ అధిష్ఠానం బుధవారం నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

Karnataka CM
తప్పుడు ప్రచారం చేస్తున్న ఛానళ్లపై పరువునష్టం దావా వేస్తా..: డీకే శివకుమార్​

By

Published : May 16, 2023, 10:55 PM IST

Karnataka CM : కర్ణాటక సీఎం ఎంపిక వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అయితే 18వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించిన నేపథ్యంలో సీఎం పేరు మంగళవారం ఖరారు చేసే అవకాశం ఉందని తొలుత వార్తలు వచ్చాయి. మరోవైపు, కర్ణాటక సీఎం పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఖర్గే.. బెంగళూరులోనే సీఎం ఎవరనేది వెల్లడిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇద్దరు బలమైన నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ సీఎం పదవిని ఆశిస్తుండటం వల్ల ఎవరికి పట్టం కట్టాలనే విషయమై కాంగ్రెస్‌ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఇద్దరిలో ఏ ఒక్కరిని ఎంపిక చేసినా మరొకరు అసంతృప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య సమావేశం

కర్ణాటక పరిణామాలపై చర్చించేందుకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఇందులో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, కర్ణాటకకు చెందిన కొందరు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. అయితే సిద్ధరామయ్యనే సీఎంగా ఎంపిక చేస్తే బాగుంటుందని.. ఈ సమావేశంలో రాహుల్, కేసీ వేణుగోపాల్ తదితరులు అభిప్రాయపడినట్లు సమాచారం.

ఖర్గేతో మంతనాలు..
ఈ నేపథ్యంలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను గౌరవప్రదమైన పదవితో ఎలా సర్దుబాటు చేయాలనే అంశంపైనే అధిష్ఠానం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కీలకమైన శాఖలతోపాటు ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని డీకేను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీఎం పదవిని ఆశిస్తున్న శివకుమార్‌ సాయంత్రం 5 గంటలకు, సిద్ధరామయ్య ఆరు గంటలకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను విడివిడిగా కలిశారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో డీకే శివకుమార్​ భేటీ

పార్టీకి వెన్నుపోటు పొడవను..
దిల్లీ వెళ్లటానికి ముందు డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబమని.. గెలిచిన 135 మంది ఎమ్మెల్యేలు అందులో సభ్యులన్నారు. అందులో ఎవరినీ విభజించడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. తాను బాధ్యతగల వ్యక్తినన్న శివకుమార్‌.. పార్టీకి వెన్నుపోటు పొడవబోనని, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయనని తేల్చి చెప్పారు.

"లోక్‌సభ ఎన్నికల్లో 18 నుంచి 20 సీట్లు గెలవడం మా తదుపరి సవాల్‌. ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి అన్నది పార్టీ నిర్ణయం. ఆ విషయంలో నాకు దిగులు ఎందుకు. నేను అర్హుడిని అని భావిస్తే పార్టీ ఇస్తుంది. నాకు మద్దతుగా ఉన్నా లేకున్నా నేను ఎమ్మెల్యేలను విభజించను. మాది ఒక ఉమ్మడి కుటుంబం. అందులో 135 మందికిపైగా సభ్యులు ఉన్నారు. వారు నన్ను ఇష్టపడినా.. ఇష్టపడకపోయినా అందులో ఎవరినీ నేను విభజించను. నేను పార్టీ అధ్యక్షుడిని. నేను బాధ్యతగల వ్యక్తిని. నేను అందరినీ సమానంగా చూస్తాను. అలా చూడటమే కాంగ్రెస్‌ పార్టీ మూల సిద్ధాంతం. మా పార్టీ నిర్ణయాన్ని నేను ఎందుకు ధిక్కరిస్తాను. నేను వెన్నుపోటు పొడవను. బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేయను."

- డీకే శివకుమార్​, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు

దావా వేస్తా..
శివకుమార్‌ తాజా వ్యాఖ్యలతో సీఎం సిద్ధరామయ్యకు సీఎం పగ్గాలు అప్పగించేందుకు మార్గం సుగమం అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సిద్ధరామయ్యకు సీఎం పదవి ఇస్తే డీకేకు ఎలాంటి పదవి ఇవ్వాలనే అంశంపై అధిష్ఠానం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తాను కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం చేస్తున్న వార్త ఛానళ్లపై పరువు నష్టం దావా వేయనున్నట్లు డీకే శివకుమార్‌ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details