Karnataka CM : కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం ఆదివారం సాయంత్రం బెంగళూరులో జరగనుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపైనే ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరగనుంది. సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను పార్టీ అధినేతకు అప్పగిస్తూ తీర్మానం చేసే సంప్రదాయం కాంగ్రెస్‌లో ఉంది. ఈసారి కూడా అలాగే చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
డీకే శివకుమార్ ఇంటికి ఒక్కలిగ సాధువులు..
Karnataka DK Shivakumar : ప్రస్తుత శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్.. సీఎం రేసులో ప్రధాన పోటీదారులుగా ముందున్నారు. ఇరువురు నేతలు తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. హరిహరపుర మఠ్‌కు చెందిన ఒక్కలిగ సాధువులు.. డీకే శివకుమార్ నివాసానికి వచ్చి ఆయన్ను కలిశారు. డీకే శివకుమార్ కూడా తూమకూర్‌లోని సిద్ధేశ్వర మఠాన్ని కుటుంబసమేతంగా సందర్శించి ఆశీస్సులు తీసుకున్నారు.
డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఖర్గేను కలిసిన సిద్ధరామయ్య..
Karnataka Siddaramaiah : సీఎల్పీ భేటీకి ముందు డీకే శివకుమార్ మఠాన్ని సందర్శించటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరో నేత సిద్ధరామయ్య ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఇది రాజకీయ సమావేశం కాదని ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే తెలిపారు. సీఎల్పీ సమావేశంలోనే సీఎం అభ్యర్థిత్వం ఖరారవుతుందని చెప్పారు.
కర్ణాటక సీఎల్పీ సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ముగ్గురు పరిశీలకులను నియమించింది. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ శిందే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్, ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి దీపక్ బబారియా.. కర్ణాటక సీఎల్పీ భేటీకి పరిశీలకులుగా హాజరుకానున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు.
డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య Karnataka Election Results : 224 స్థానాలు ఉన్న కర్ణాటక శాసనసభకు ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. భారతీయ జనతా పార్టీకి 66 సీట్లు, మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్ 19 స్థానాలు గెలుపొందాయి. 8సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన డీకే శివకుమార్, 9సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సిద్ధరామయ్య.. సీఎం అభ్యర్థిత్వానికి పోటీదారులమని ఇద్దరు నేతలు బహిరంగంగానే ప్రకటించుకున్నారు.
విభేదాలు బయటపడకుండా పక్కాగా..
పార్టీలో గ్రూపు తగాదాలు ముఖ్యంగా సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య విభేదాలు బయటపడకుండా కాంగ్రెస్ ప్రచార వ్యూహాన్ని పక్కాగా అమలుచేసింది. పార్టీ గెలిస్తే తమ నాయకుడే సీఎం అభ్యర్థి అని.. ఇరువురి మద్దతుదారులు బహిరంగంగా ప్రకటనలు చేసుకున్న నేపథ్యంలో.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో నేతల మధ్య విభేదాలు బయటపడకుండా, పార్టీ విజయావకాశాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంది. అదే విధంగా అన్ని వర్గాలతోపాటు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సీఎల్పీ నేతను ఎంపికచేసే బాధ్యత ఏఐసీసీ చేతుల్లోనే ఉందనే చెప్పాలి.
సిద్ధ, డీకే ఇళ్ల ముందు ఫ్లెక్సీల సందడి!
ఇప్పటికే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నివాసాల ముందు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. పార్టీ విజయానికిగాను కృతజ్ఞతలు చెబుతూ.. కాబోయే సీఎంఅంటూ వారి మద్దతుదారులు నినాదాలు రాశారు. సిద్ధరామయ్య ఈసారిగాని సీఎల్పీ నేతగా ఎన్నికయితే.. రెండోసారి కర్ణాటక సీఎం అవుతారు. తొలిసారి ఆయన 2013-18 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. డీకే శివకుమార్ సిద్ధరామయ్య కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆదివారం సాయంత్రం జరిగే సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించనున్నారు. వచ్చే ఫలితం ఆధారంగా అవసరమైతే కొత్త నేతను ఎన్నుకునేందుకు ఓటింగ్ కూడా చేపట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
డీకే శివకుమార్, సిద్ధరామయ్య పోస్టర్లు కర్ణాటకలో లింగాయత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉండగా తర్వాత స్థానంలో ఒక్కలిగలు ఉన్నారు. ఆ వర్గానికి చెందిన డీకే శివకుమార్.. సీఎం పదవికి తాను పోటీదారునని బహిరంగంగానే పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. తాను కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నందున ఒక్కలిగకు చెందిన వ్యక్తి సీఎం అయ్యే అవకాశాన్ని కోల్పోవద్దని.. డీకే శివకుమార్ తమ సామాజికవర్గాన్ని కోరారు.
1999లో చివరిసారి ఒక్కలిగ సామాజికవర్గానికి చెందిన ఎస్ఎం కృష్ణ ఎన్నికల ప్రచారానికి సారథ్యం వహించారు. ఆ తర్వాత ఆయనే సీఎం పగ్గాలు చేపట్టారు. ఒక్కలిగల ప్రభావం ఎక్కువగా ఉన్న పాత మైసూరులో ఈసారి కాంగ్రెస్ బలం పెరిగింది. ఆ ఘనత శివకుమార్‌కే దక్కనుంది. సిద్ధరామయ్య, శివకుమార్‌తోపాటు దళిత వర్గానికి చెందిన మాజీ పీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర, మాజీ కేంద్రమంత్రి మునియప్ప, లింగాయత్ వర్గానికి చెందిన ఎంబీ పాటిల్ కూడా సీఎం రేసులో ఉన్నారు.