Karnataka cm change: కర్ణాటకలో నాయకత్వ మార్పు జరగనుందని.. సీఎంగా బసవరాజ్ బొమ్మై స్థానంలో భాజపా అధిష్ఠానం మరొకరిని నియమించనుందనే ఊహాగానాలు కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. వీటికి.. ఇటీవల తన నియోజకవర్గ ప్రజలనుద్దేశించి బొమ్మై భావోద్వేగంగా మాట్లాడడం.. మరింత బలాన్ని చేకూర్చింది. ఈ నేపథ్యంలో బసవరాజ్ బొమ్మై శనివారం కీలక ప్రకటన చేశారు. తాను రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. హుబ్లీలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
"నేను విదేశాలకు వెళ్లడం లేదు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి వచ్చే ప్రసక్తే లేదు. దావోస్‌లో జరగాల్సిన కార్యక్రమం జూన్‌కు వాయిదా పడింది. కాబట్టి నాకు విదేశాలకు వెళ్లే ఆలోచన లేదు."
-బసవరాజ్ బొమ్మై, కర్ణాటక ముఖ్యమంత్రి.
Karnatka Leadership change news: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక భాజపా అధ్యక్షుడు నలిన్ కుమార్ కతీల్ సైతం కొట్టిపారేశారు. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగేవరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై కొనసాగుతారని వారు పేర్కొన్నారు. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప రాజీనామా చేయనున్నారని ఊహాగానాలు వచ్చినప్పటికీ.. ఆయన రెండేళ్లపాటు పదవిలోనే కొనసాగారని నళిన్ కుమార్ కతీల్ పేర్కొన్నారు.
"బొమ్మై రాజీనామా చేయనున్నారనే వార్తలన్నీ ఊహాగానాలు మాత్రమే. ఇది రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం సృష్టించడానికి, భాజపా ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రగా భావిస్తున్నాను. ఈ పుకార్ల వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంటుందని నా అనుమానం."