తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఠాక్రే వ్యాఖ్యలపై కన్నడ నేతల మండిపాటు - ఠాక్రే వ్యాఖ్యలపై మండిపడ్డ కర్ణాటక సీఎం యడియూరప్ప

కర్ణాటక, మహారాష్ట్ర సర్కార్​ల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. కర్ణాటక ప్రాంతంలోని మరాఠాలను తమ రాష్ట్రంలో విలీనం చేయాలన్న ఉద్ధవ్​ ఠాక్రే వ్యాఖ్యలపై మండిపడ్డారు కన్నడ నేతలు. ఠాక్రే ప్రకటనలను ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా.. ఇరురాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని దెబ్బతీసేందుకే ఠాక్రే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

Karnataka vs Maharashtra
కర్ణాటక X మహారాష్ట్ర: ఠాక్రే వ్యాఖ్యలపై మండిపడ్డ కన్నడ నేతలు

By

Published : Jan 19, 2021, 5:24 AM IST

కర్ణాటక పరిధిలో మరాఠీ మాట్లాడేవారి ప్రాంతాలను మహారాష్ట్రలో విలీనం చేయాలన్న ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే వ్యాఖ్యలపై మండిపడ్డారు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప. ఇవి భారత ఐక్యతా సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. మహాజన్​ నివేదికే అంతిమమైనదని, అదే వాస్తవమని ఆయన పేర్కొన్నారు. ఠాక్రే.. వివాదాస్పద వ్యాఖ్యలతో స్నేహపూర్వక వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుండటం బాధాకరమని చెప్పుకొచ్చారు యడ్డీ. ప్రాంతీయత, భాషపై చర్చలు దేశ ఐక్యతకు భంగం కలిగిస్తాయని.. ఈ అంశాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. కర్ణాటకలో మరాఠాలు కన్నడిగులతో నివసిస్తుండగా, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోని కన్నడిగులతో మరాఠాలు కలిసి ఉంటున్నారని.. అలాంటప్పుడు ఈ తారతమ్య భేదం ఎందుకని ప్రశ్నించారు.

ఠాక్రే ఏమన్నారంటే.?

మరాఠీ మాట్లాడే ప్రజలు అధికంగా ఉండే కర్ణాటక ప్రాంతాలను తమ రాష్ట్రంలో చేర్చుకునేందుకు కట్టుబడి ఉన్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఠాక్రే తెలిపారు. మునుపటి ముంబయి ప్రెసిడెన్సీలో భాగమైన బెల్గాం, ఇతర ప్రాంతాలను గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కానీ ప్రస్తుతం.. కర్ణాటకలో భాష ప్రాతిపదికన అలా చేయడం లేదన్నారు.

ఇదిలా ఉండగా.. బెల్గాం, ఇతర సరిహద్దు ప్రాంతాలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం సుప్రీంకోర్టులో ఏళ్ల తరబడి అలాగే ఉంది.

ఇదీ చదవండి:'ఆ ప్రాంతాల విలీనమే నిజమైన నివాళి'

ఠాక్రే వ్యాఖ్యలపై మండిపడ్డ కన్నడ నేతలు:

1. కాంగ్రెస్​ చీఫ్​, డీకే శివకుమార్​

ఠాక్రే వ్యాఖ్యలపై కాంగ్రెస్​ చీఫ్ డీకే శివకుమార్​ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. సరిహద్దు వివాదాల విషయంలో తరచూ ప్రకటనలు చేస్తూ కొత్తరకం ఘర్షణలు రేపడం బాధాకరమన్న ఆయన.. ఈ విషయంలో మహాజన్​ నివేదికే తుది తీర్పు అని పేర్కొన్నారు. కాబట్టి బెళగావి మహారాష్ట్రకు చెందినది కాదని మళ్లీ నిరూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

2. సిద్ధారామయ్య, శాసనసభ ప్రతిపక్ష నాయకుడు

ఉద్ధవ్​ వ్యాఖ్యలను శాసనసభ ప్రతిపక్షనేత సిద్ధా రామయ్య ఖండించారు. "ప్రాంతం, భాష, రాష్ట్రం విషయంలో మేము రాజీపడేది లేదు, అలాగని రాజకీయాలు చేయదలుచుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు, ఎప్పటికైనా బెళగావి ప్రాంతం కర్ణాటకకు చెందినదే. ఠాక్రే ప్రకటనలు వాస్తవాలను మార్చలేవు" అని అన్నారు.

3. హెచ్​డీ కుమారస్వామి, కర్ణాటక మాజీ సీఎం

మహారాష్ట్ర సీఎం ప్రకటనలు చైనా విస్తరణవాద లక్షణాన్ని ప్రదర్శించేవిగా ఉన్నాయని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి. "నాడు.. భారత యూనియన్​ వ్యవస్థ ఆధారంగానే రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన విభజించారు. కానీ.. ఇప్పుడు ఠాక్రే ప్రజల మధ్య విద్వేషాల్ని రగిలించేందుకు ప్రయత్నిస్తున్నారు." అని ఘాటుగా స్పందించారు.

ఆ ప్రకటనలతో బెళగావిలో నిరసన..

ఉద్ధవ్​ ఠాక్రే ప్రకటన అనంతరం.. కన్నడ అనుకూల ప్రాంతమైన బెళగావిలో నిరసనలు హోరెత్తాయి. ఈ ప్రాంతం ముమ్మాటికీ కర్ణాటకకు చెందినదేనని ఉద్ఘాటించారు. ఠాక్రే వ్యాఖ్యలపై తమ ప్రభుత్వం తీవ్రంగా స్పందించకపోవడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడి ప్రజలు. కన్నడ నాట శివసేనను బహిష్కరించాలంటూ పట్టుపట్టారు.

ఇదీ చదవండి:'ఇరుపక్షాలు పరిష్కారం కోరుకుంటున్నాయి.. కానీ!'

ABOUT THE AUTHOR

...view details