Karnataka CM security: బెంగళూరులో డ్రగ్స్ రాకెట్ నడుపుతున్న కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై భద్రతా సిబ్బందిని అధికారులు అరెస్ట్ చేశారు. గంజాయి విక్రయిస్తున్న ఆరోపణలతో సీఎం నివాసంలో పని చేస్తున్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోరమంగళ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివకుమార్,సంతోష్లుగా గుర్తించారు. వీరిద్దరూ ఆర్‌టీ నగర్లోని సీఎం బొమ్మై నివాసం వద్ద భద్రతా సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారు.
నిందితులు.. మాదకద్రవ్యాల వ్యాపారుల నుంచి డ్రగ్స్ తీసుకుని కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సీఎం నివాసం సమీపంలోని డన్జో ద్వారా డ్రగ్స్ సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మాదకద్రవ్యాలు అందుకుంటున్న సమయంలో డబ్బుల విషయమై డ్రగ్స్ వ్యాపారులతో వాగ్వాదం జరిగిందని.. అనుమానంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అప్పటికే వారికి గంజాయి పార్శిల్ అందినట్లు వెల్లడించారు.
అరెస్టు చేసే సమయంలో కానిస్టేబుళ్లు సాధారణ దుస్తుల్లో ఉన్నారని.. మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ వ్యాపారులు అమ్జద్ ఖాన్, అఖిల్ రాజ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో నిందితులు అంగీకరించినట్లు తెలిపారు. ఇద్దరు డ్రగ్స్ వ్యాపారులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.