Businessman Donates: కర్ణాటక బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. తన తల్లి జ్ఞాపకార్థం ఆమె చదువుకున్న ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలకు భారీగా విరాళం ఇచ్చారు. రూ.2 కోట్లతో 14 గదుల భవనాన్ని నిర్మించారు. అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠాశాలకు హైటెక్ హంగులు అద్దారు.
బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త హర్ష.. బిజినెస్ పనిమీద వెళ్తూ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కోరా గ్రామాన్ని సందర్శించారు. అది తన అమ్మమ్మ వాళ్ల ఊరు. తన తల్లి సర్వమంగళ నాగయ్య చదువుకున్న పాఠశాలకు వెళ్లారు. జాతీయ రహదారి విస్తరణ కోసం పాఠశాల భవనంలో కొంత భాగాన్ని కూల్చివేసిన విషయాన్ని తెలుసుకున్నారు. దానిని చూసి చలించిపోయిన హర్ష.. గ్రామ పెద్దలు, అధికారులను కలిసి మాట్లాడారు. తన తల్లి జ్ఞాపకార్థం కొత్త భవనం నిర్మించేందుకు కావాల్సిన డబ్బులు తాను ఇస్తానని చెప్పారు. ప్రభుత్వ భూమిలో సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేసి 14 గదులతో కొత్త భవనాన్ని నిర్మించారు. ప్రస్తుత రోజులకు తగినట్లుగా స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. వ్యాపార వేత్త హర్షను ఈటీవీ భారత్ సంప్రదించగా పలు విషయాలు వెల్లడించారు.
"నేను బెంగళూరులో ఉంటాను. మా తల్లిగారు సర్వమంగళ నాగయ్య ఈ గ్రామంలోనే జన్మించారు. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేశారు. వివాహం తర్వాత బెంగళూరుకు వెళ్లారు. ఈ గ్రామం కోసం ఏదైనా చేయాలని ఎప్పుడూ అనుకునేవాడిని. ప్రస్తుతం 14 గదుల భవనం నిర్మించి కంప్యూటర్లు, స్మార్ట్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేశాం. అంతకు ముందు గ్రామస్థులు, పంచాయతీ అధ్యక్షుడిని కలిసి మాట్లాడాను. నా కలను నిజం చేసుకునేందుకు వారంతా అంగీకరించారు. అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేశాం."