కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై 2023-24 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రైతులకు పెద్దపీట వేస్తూ ఈ బడ్జెట్‌ను ప్రకటించారు. ఈ ఏడాది 30 లక్షల మందికి పైగా రైతులకు రూ.25 వేల కోట్ల రుణాలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. రైతులకు ఇచ్చే వడ్డీ లేని రుణాన్ని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆయన శుక్రవారం ప్రకటించారు. దీంతో పాటుగా భూమిలేని మహిళా రైతు కూలీల కోసం 'శ్రమ శక్తి' అనే కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
కర్ణాటకలో ఏప్రిల్-మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆర్థిక శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం బసవరాజ్ బొమ్మై 2023-24 బడ్జెట్‌ను రాష్ట్ర శాసనసభలో శుక్రవారం ఉదయం ప్రవేశపెట్టారు. ఎన్నికల దృష్ట్యా రైతుల ఓట్లను ఆకర్షించేందుకు వారికి ఇచ్చే స్వల్పకాలిక వడ్డీలేని రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ఏడాది 30 లక్షల మందికి పైగా రైతులకు రూ.25 వేల కోట్ల రుణాలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 'కిసాన్ క్రెడిట్ కార్డ్' ఉన్న రైతులకు 'భూ సిరి' అనే కొత్త పథకం కింద 2023-24 సంవత్సరంలో రూ.10,000 అదనపు సబ్సిడీని ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో రైతులు అత్యవసర సమయాల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతర వ్యవసాయ సామగ్రి కొనుగోలు చేసేందుకు వీలు కలుగుతుందని సీఎం అన్నారు. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.2,500 ఇవ్వగా.. నాబార్డ్ రూ.7,500 అందజేస్తుందని తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలోని దాదాపు 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు.
బడ్జెట్ పత్రాలతో సీఎం బసవరాజ్ బొమ్మై ఈ ఏడాది బడ్జెట్లో భాగంగా కొత్తగా ప్రవేశపెట్టనున్న 'శ్రమ శక్తి' పథకం ద్వారా.. భూమిలేని మహిళా రైతు కూలీలకు ప్రతి నెలా ఒక్కొక్కరికీ రూ.500 ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఉన్నత పాఠశాలల నుంచి ఉత్తీర్ణులయ్యే పిల్లలందరూ.. పై చదువులు కొనసాగించాలనే లక్ష్యంతో 'సీఎం విద్యా శక్తి' పథకాన్ని ప్రవేశ పెడుతున్న తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ యూనివర్సిటీల్లో, డిగ్రీ కళాశాలల్లో ఉచిత విద్యను అందిస్తామన్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని 8 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. రామనగర జిల్లాలోని రామదేవర బెట్టలో రాముడికి అంకితమిచ్చిన ఆలయాన్ని కూడా నిర్మించడానికి నిధులను కేటాయించినట్లు స్పష్టంచేశారు. డేటా భద్రతను మరింత కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా.. వివిధ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల కోసం రూ. 590 కోట్లతో క్లౌడ్ ఆధారిత స్టేట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని బొమ్మై ప్రభుత్వం ప్రతిపాదించింది.
కొవిడ్ మహమ్మారి తర్వాత రాష్ట్రంలో మొదటిసారి ప్రవేశ పెడుతున్న బడ్జెట్లో రెవెన్యూ రాబడుల కంటే రెవెన్యూ వ్యయం రూ. 402 కోట్లు ఎక్కువగా అంచనా వేశారు. దీంతో ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను 'రాబడి-మిగులు' బడ్జెట్‌గా అభివర్ణించారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.
చెవిలో పువ్వులతో కాంగ్రెస్ నేతల నిరసన
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ సభ్యులు కొందరు చెవిలో పువ్వులు పెట్టుకుని వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు చేస్తోందని ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలనే ఇంకా నెరవేర్చలేదని.. ఇప్పుడు మళ్లీ కొత్త వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెవిలో పువ్వుతో సిద్ధరామయ్య కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన