ఎమ్మెల్యే కార్లను తగలబెట్టిన దుండగులు కర్ణాటక భాజపా నేత, బొమ్మనహళ్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి ఇంటి ముందు నిలిపి ఉంచిన రెండు ఖరీదైన కార్లను గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు. దుండగులు అక్కడి నుంచి పారిపోతున్న దృశ్యం సీసీటీవీలో రికార్డయింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై ఎమ్మెల్యే సతీశ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డీసీపీ శ్రీనాథ్ మహాదేవన్ ఎమ్మెల్యే నివాసాన్ని, కాలిపోయిన వాహనాలను పరిశీలించారు.
"బుధవారం రాత్రి 1.30గంటలకు ఎమ్మెల్యే ఇంటి వెనుకనుంచి చొరబడిన దుండగులు పెట్రోల్ పోసి రెండు వాహనాలకు నిప్పుపెట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం."
-పోలీసు వర్గాలు
ఈ ఘటన వెనుక రాజకీయ కారణలు ఉండకపోవచ్చని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. 'దీనిని రాజకీయం చేయాలనుకోట్లేదు' అని తెలిపారు.
దగ్ధమైన కారుపై కవరు కప్పుతున్న పోలీసులు
"ఇంటి ముందు గేటు వద్ద సీసీటీవీ అమర్చినప్పటికీ నిందితుల ముఖాలు సరిగా కనిపించలేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరితోనూ వివాదాలు లేవు. రాజకీయ కారణాలతో ఈ ఘటన జరిగినట్లు అనిపించట్లేదు. పోలీసులు దర్యాప్తులో నిజానిజాలు బయటపడతాయి."
-సతీష్ రెడ్డి, ఎమ్మెల్యే
సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు ఇంట్లో కుక్కలు ఎలాంటి శబ్దం చేయలేదని గుర్తించారు. ఎమ్మెల్యేకు పరిచయమున్న వ్యక్తి హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కేసులో ముగ్గురు నిందితులున్నట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిని తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు. వీరి వెనకు ఎవరున్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు.
అదే కారణమా?
ఇటీవల ఓ నది మధ్యలో కృత్రిమంగా నిర్మించిన శివుని విగ్రహానికి సంబంధించిన అంశంలో సతీష్ రెడ్డి జోక్యం చేసుకున్నారని.. అందుకే చెందిన నిందితులు కారుకు నిప్పు పెట్టినట్లు అనుమానిస్తున్నారు.
ఇవీ చదవండి: