తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అఫ్గాన్​ మహిళకు బెంగళూరు వైద్యుల పునర్జన్మ! - అరుదైన శస్త్రచికిత్స

అఫ్గాన్​ మహిళకు అరుదైన చిన్నపేగు మార్పిడి శస్త్రచికిత్సను బెంగళూరు వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఫోర్టిస్​ ఆస్పత్రికి చెందిన డాక్టర్​ గోపశెట్టి నేతృత్వంలోని వైద్య బృందం ఈ శస్త్రచికిత్స నిర్వహించింది. పేగు సంబంధిత సమస్యతో పాటు రక్తం గడ్డ కట్టే సమస్యతో బాధపడుతున్న ఆ మహిళ ప్రాణాలను వైద్యులు కాపాడగలిగారు.

fortis hospital
అఫ్గాన్​ మహిళకు బెంగళూరులో శస్త్రచికిత్స

By

Published : Jul 17, 2021, 12:30 PM IST

Updated : Jul 17, 2021, 12:48 PM IST

బెంగళూరులోని ఫోర్టిస్​ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. అఫ్గానిస్థాన్​ కాబుల్​కు చెందిన ఓ 27 ఏళ్ల మహిళకు అతి క్లిష్టమైన చిన్న పేగు మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. చిన్నపేగు సంబంధిత సమస్యతో పాటు రక్తం గడ్డ కట్టే సమస్యతో బాధపడుతున్న ఆ మహిళకు వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు.

బతకదన్నారు..

సదరు మహిళ ఐదు నెలలు గర్భిణీగా ఉన్నప్పుడు చిన్నపేగు సంబంధిత సమస్య మొదలైంది. కాబుల్​ వైద్యులు.. చిన్నపేగు మార్పిడి చికిత్స తమ వద్ద అందుబాటులో లేకపోవడం వల్ల మహిళ ప్రాణాలు కాపాడగలమని ధీమాగా చెప్పలేకపోయారు. ఆమె బతికేందుకే కొద్దిపాటి అవకాశం మాత్రమే ఉందన్నారు. ఆమెకు టీపీఎన్(పైపుల ద్వారా)​ విధానంలో ఆహారాన్ని అందించడం ప్రారంభించారు. అయితే.. బెంగళూరులోని ఫోర్టిస్​ ఆస్పత్రిని ఆమె ఆశ్రయించింది.

మూడు నెలలపాటు నిరీక్షణ​..

పరీక్షల అనంతరం బెంగళూరు వైద్యులు.. చిన్నపేగు మార్పిడి శస్త్రచికిత్స చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ, మూడు నెలలపాటు ఆమెను వెయిటింగ్ లిస్టులో ఉంచారు. టీపీఎన్​ విధానంలో ఆమెకు సరైన ఆహారం అందక, దానికి తోడు దీర్ఘకాలిక వ్యాధులు వెంటాడగా ఆమె ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు రక్తంలో సమస్యలు ఎదురయ్యాయి. దాంతో వైద్యులు ఆమెకు 24 గంటలపాటు ఇంజెక్షన్లు, సెలైన్లు ఇస్తూ కాపాడుతూ వచ్చారు.

కరోనాతో లాక్​డౌన్​ విధించగా.. ఆమెకు తగిన దాత దొరకడం కష్టతరమైందని మహిళకు చికిత్స అందించిన వైద్యుడు డాక్టర్​ మహేశ్​ గోపశెట్టి తెలిపారు. అందుకే ఆమె 3 నెలలు పాటు ఎదురుచూడాల్సి వచ్చిందని చెప్పారు.

"కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ అమె ప్రాణాల్ని కాపాడాలని మేం నిర్ణయించాం. మూడు నెలల తర్వాత బ్రెయిన్​ డెడ్​ అయిన ఓ దాత దొరికాడు. దాంతో వెంటనే మేం ఈ అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేశాం. రక్తంలో గడ్డ కట్టే సమస్యలు ఆ మహిళకు ఉండగా శస్త్రచికిత్స చేయడం ఇబ్బందిగా మారింది. రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు బ్లడ్​ థిన్నర్స్​ను ఆమెకు అందించాం. దాంతో ఆమెకు రక్తస్రావ సమస్య ఎదురైంది. రక్తస్రావాన్ని ఆపేందుకు మరో శస్త్రచికిత్స నిర్వహించాల్సి వచ్చింది.

-డాక్టర్​ గోపశెట్టి, ఫోర్టిస్​ ఆస్పత్రి వైద్యుడు, బెంగళూరు

వైద్యులకు ధన్యవాదాలు

వివిధ విభాగాలకు చెందిన వైద్యుల సమన్వయంతో ఈ శస్త్రచికిత్సను తాము పూర్తి చేశామని వైద్యులు పేర్కొన్నారు. తన భార్యకు పునర్జన్మ ప్రసాదించారని వైద్యులకు మహిళ భర్త గులామ్ కృతజ్ఞతలు తెలిపారు.

"దాదాపు 7 నెలల కిందట నా భార్య తీవ్రమైన పొత్తికడుపు నొప్పితో బాధపడింది. చిన్నపేగుకు సమస్యలు ఉన్నట్లు తేలగా.. అఫ్గాన్​ వైద్యులు పేగును తొలగించాలని అన్నారు. అయితే.. ఈ శస్త్రచికిత్స చేస్తే నా భార్య బతుకుతుందో లేదో చెప్పలేమని అన్నారు. ఈ వ్యాధికి చికిత్స అందించే ఆస్పత్రులు ఎక్కడ ఉన్నాయోనని అన్ని దేశాల్లో వెతికాం. చివరకు బెంగళూరులో ఫోర్టిస్​ ఆస్పత్రి వైద్యులు ఈ చికిత్స నిర్వహించగలరని తెలుసుకుని ఆశ్రయించాం."

-గులాం, మహిళ భర్త

వైద్యుల కృషి ఫలితంగా ఇప్పుడు ఆ మహిళ మునపటిలా ఆహారాన్ని, పానీయాలను తీసుకోగలుగుతోంది. దాతతోపాటు, తనకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్​ గోపశెట్టి వైద్య బృందానికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఆమె చెప్పింది.

ఇదీ చూడండి:15 రోజుల్లో 16 మంది అనుమానాస్పద మృతి!

ఇదీ చూడండి:పారిశుద్ధ్య కార్మికురాలు.. డిప్యూటీ కలెక్టరయ్యింది!

Last Updated : Jul 17, 2021, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details