ఆలయంలో ఉండే ఏనుగుతో ఆ గ్రామస్థులది విడదీయరాని బంధం. తమ ఊరిలో జరిగే ఎన్నో వేడుకల్లో ఆ గజరాజును వాళ్లు భాగం చేసుకున్నారు. తమ కుటుంబంలో ఒకరిగా భావించారు. అలాంటి ఆ ఏనుగు మరణించిన వార్త తెలుకుని.. ఆ గ్రామస్థులు బోరున విలపించారు.
కర్ణాటక బెల్గాం జిల్లా(karnataka belgaum district news) చిప్పలికట్టి గ్రామంలోని మహాలక్ష్మి ఆలయంలో 'సుధ' అనే 60 ఏళ్ల వయసు ఉన్న ఆడ ఏనుగు.. ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉంటోంది. ఆలయంలో జరిగే ఎన్నో ఉత్సవాల్లో ఆ ఏనుగు పాల్గొంది. వృద్ధాప్యంతో పాటు, కాలికి గాయం కాగా.. సుధ ఇటీవల అనారోగ్యం బారిన పడింది. నెలరోజులుగా చికిత్స పొందుతున్న ఆ ఏనుగు పరిస్థితి విషమించి, సోమవారం కన్నుమూసింది.
1975లో 'సుధ'ను మహాలక్ష్మి దేవాలయానికి తీసుకువచ్చారు. వివిధ రాష్ట్రాల్లో జరిగే అనేక కార్యక్రమాల్లోనూ ఈ ఏనుగు పాల్గొంది. 'సుధ' మరణవార్త విని గ్రామస్థులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. చిప్పలికట్టి సమీప గ్రామాల్లోని ప్రజలు కూడా ఆ ఏనుగును కడసారి చూసేందుకు తరలి వచ్చారు. రామదుర్గ ఎమ్మెల్యే మహాదేవప్ప యదవాడా, బెళగావి జిల్లా కలెక్టర్ సహా ఇతర అధికారులు కూడా వచ్చి ఏనుగుకు తుది వీడ్కోలు పలికారు.