తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫ్రీ కరెంటు, నిరుద్యోగ భృతి.. ఉచితాలపైనే కాంగ్రెస్ ఆశలు! కర్ణాటకలో మెజార్టే లక్ష్యం! - free power karnataka congress

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి చెక్‌ పెట్టేందుకు కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. కాషాయదళంలో అసంతృప్తులను చేర్చుకుంటున్న హస్తం పార్టీ... ఉచిత హామీలు ఎన్నికల్లో విజయాన్ని కట్టబెడతాయని భావిస్తోంది. ఇప్పటికే 4ఉచిత హామీలను ప్రకటించిన కాంగ్రెస్‌... మేనిఫెస్టోలో మరిన్ని చేర్చేందుకు కసరత్తు చేస్తోంది.

KARNATAKA CONGRESS
KARNATAKA CONGRESS

By

Published : Apr 15, 2023, 8:04 PM IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిసారి ఏ పార్టీకీ సరైన మెజార్టీ రాకపోవడం వల్ల ప్రభుత్వంలో అస్థిరత కనిపిస్తోంది. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా పూర్తి మెజార్టీ దక్కించుకోవాలని కాంగ్రెస్‌ పట్టుదలగా ఉంది. ప్రస్తుతం కర్ణాటకలో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ.. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్‌.. కీలక పాత్ర పోషించి చక్రం తిప్పాలని జేడీఎస్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూనే సంక్షేమం పేరుతో కాంగ్రెస్‌ ప్రజల్లోకి వెళుతోంది. ఉచిత కరెంటు, మహిళలకు ఆర్థిక సాయం, ఉచిత బియ్యం, నిరుద్యోగ భృతి వంటి 4 హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది.

ఉచిత హామీలపై అన్ని పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ ముందంజలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించకముందే కర్ణాటక కాంగ్రెస్‌ నేతలు హామీలు గుప్పించడం మొదలుపెట్టారు. అధికారంలోకి వస్తే 'గృహజ్యోతి' కార్యక్రమం ద్వారా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు 'గృహలక్ష్మి' పథకం ద్వారా ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు ప్రతి నెల 2వేల రూపాయలు అందజేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. 'అన్న భాగ్య యోజన' పేరుతో ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చింది.

ఆప్ వర్సెస్ కాంగ్రెస్
దేశ రాజధానిలో తొలుత అధికారాన్ని చేజిక్కించుకున్న ఆమ్‌ఆద్మీ పార్టీ పలు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ఉచిత కరెంటు వంటి హామీలను ప్రయోగించింది. ఇదే ఫార్ములాను పంజాబ్‌లో ప్రయోగించిన ఆమ్‌ ఆద్మీ అక్కడ అధికారం సాధించింది. అయితే గోవా, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో ఆమ్‌ ఆద్మీ ప్రభావం నామమాత్రంగానే కనబడింది. అయినప్పటికీ.. జాతీయ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం తామే అంటూ ఆప్‌ ప్రచారం చేస్తుండటం కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

మరోవైపు గుజరాత్‌లో ఘోర పరాభవం చవిచూసిన కాంగ్రెస్‌.. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లలోనూ ఆశించిన పనితీరు ప్రదర్శించలేకపోయింది. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీను ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పార్టీకి కొంత బలాన్నిచ్చినట్లైంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన భారత్‌ జోడో యాత్రకు కర్ణాటకలో భారీ మద్దతు లభించిందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పలు హామీలతో కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోంది.

కర్ణాటకలో అధికార పీఠం దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్‌.. 43మంది అభ్యర్థులతో మూడో విడత జాబితా విడుదల చేసింది. భారతీయ జనతా పార్టీ మాజీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్‌ సవాదిని.... అథాని నుంచి బరిలో దించింది. శుక్రవారం కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఆ మరుసటి రోజే పార్టీ టికెట్‌ పొందారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచే బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వరుణ నుంచి పోటీ చేస్తున్న మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్‌ నేత సిద్ధరామయ్య రెండో స్థానంగా కోలార్‌ నుంచి పోటీ చేయాలని ఆశించారు. ఆయన కాకుండా జి.మంజునాథ్‌కు టికెట్‌ ఇచ్చారు. మాజీ గవర్నర్‌ మార్గరేట్‌ అల్వా కుమారుడు నివేదిత్‌ అల్వా... కుమట నుంచి పోటీ చేయనున్నారు. ఇప్పటివరకు మెుత్తం 209స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ మరో 15 సీట్లకు అభ్యర్థుల ఖరారు చేయాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details