తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓటింగ్ టైమ్.. కర్ణాటకలో పోలింగ్​కు సర్వం సిద్ధం.. లక్షన్నర మందితో భద్రత - కర్ణాటక అసెంబ్లీ షెడ్యూల్

Karnataka Assembly Election : ఆరోపణలు- ప్రత్యారోపణలు.. హోరాహోరీ ప్రచారాలు.. జాతీయ నేతల పర్యటనలు.. అన్నీ ముగిశాయి. ఇక ఓటరు తీర్పు నిక్షిప్తమయ్యే సమయం ఆసన్నమైంది. కర్ణాటకలో పోలింగ్​కు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. బుధవారం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పటిష్ఠ భద్రత మధ్య పోలింగ్ సాగేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.

Karnataka assembly election
Karnataka assembly election

By

Published : May 9, 2023, 4:54 PM IST

Updated : May 9, 2023, 7:43 PM IST

Karnataka Assembly Election : ప్రధాన పార్టీల అగ్రనాయకుల ప్రచారంతో హోరెత్తి పోయిన కర్ణాటకలో బుధవారం పోలింగ్‌ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. కర్ణాటకలో 5 కోట్లకు పైగా అర్హులైన ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 224 అసెంబ్లీ స్థానాల్లో 2,615 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

ఓటరు ముఖచిత్రం
పోలింగ్ ఏర్పాట్లు
ఓటింగ్ యంత్రాలను తరలిస్తున్న సిబ్బంది

భద్రత కట్టుదిట్టం
Karnataka election news : పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రత విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇలాంటి స్టేషన్ల కోసం మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. వెబ్​క్యాస్టింగ్, సీసీటీవీల ద్వారా పోలింగ్ కేంద్రాలను అధికారులు పర్యవేక్షించనున్నారు.

పటిష్ఠ భద్రత
కర్ణాటకలో భద్రతా దళాల పహారా
పోలీసు అధికారులతో సమీక్ష

రికార్డు స్థాయిలో సీజ్​
కర్ణాటక ఎన్నికల్లో ధన ప్రవాహం సైతం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికలతో పోలిస్తే 4.5 రెట్లు అధికంగా నగదు, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రూ.375కోట్ల లిక్కర్, డ్రగ్స్​ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ రూ.288 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం 224 సీట్లు ఉండగా.. 81 స్థానాల్లో ప్రలోభాలు అధికంగా ఉన్నట్లు ఈసీ గుర్తించింది.

kర్ణాటకలో పట్టుబడ్డ నగదు, బంగారం

హైఓల్టేజ్ ప్రచారం
లోక్​సభ ఎన్నికలకు ముందు జరగనున్న పెద్ద రాష్ట్రాల ఎన్నికల్లో కర్ణాటక కీలకం. అందుకే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈ ఎలక్షన్​ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో 38 ఏళ్లుగా వస్తున్న అధికార మార్పిడి సంప్రదాయానికి చెక్ పెట్టాలన్న లక్ష్యంతో బీజేపీ ప్రచారం నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ ముందుండి ప్రచారాన్ని నడిపించారు. మార్చి 29న ఎన్నికల ప్రకటన రాగా.. ఆలోపే రాష్ట్రంలో ఏడుసార్లు పర్యటించారు. పోలింగ్ దగ్గర పడుతున్నకొద్దీ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. ఏప్రిల్ 29 తర్వాత 18 మెగా పబ్లిక్ మీటింగ్​లు, ఆరు రోడ్​షోలు నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అగ్రనేతలు సైతం కర్ణాటకలో పర్యటించారు.

ప్రచారంలో రికార్డు

అధికార బీజేపీని గద్దెదించాలని భావిస్తున్న కాంగ్రెస్ మాత్రం స్థానిక సమస్యలపైనే ప్రధానంగా దృష్టిసారించింది. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రస్తావిస్తూ ప్రచారంలో దూకుడు ప్రదర్శించింది. గ్యారంటీల పేరిట ప్రజలపై ఉచితాల హామీలు కురిపించింది. ప్రారంభంలో ప్రచారం సైతం స్థానిక నేతలే భుజానికెత్తుకున్నారు. తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్టీ తరఫున ప్రచారం చేశారు. చివర్లో సోనియా గాంధీ సైతం ఓ బహిరంగ సభ నిర్వహించారు.

మహిళల కోసం సఖి పోలింగ్ కేంద్రం (ఎడమ); గిరిజన సంప్రదాయ డిజైన్లతో హంగులు

రాష్ట్రంలో కింగ్​మేకర్​గా నిలవాలని చూస్తున్న జేడీఎస్ సైతం ప్రచారంలో ఎక్కడా తగ్గలేదు. తనకు పట్టున్న పాత మైసూరు ప్రాంతంతో పాటు ఇతర నియోజకవర్గాల్లోనూ బలంగా ప్రచారం నిర్వహించింది. జేడీఎస్ దిగ్గజం దేవెగౌడ(89) ప్రారంభంలో ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ.. తర్వాత రంగంలోకి దిగారు. పాత మైసూరు ప్రాంతంలో తమ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఆయన కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి.. ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రవ్యాప్తంగా జేడీఎస్​ తరఫున ముందుండి ప్రచారం చేశారు.

Last Updated : May 9, 2023, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details