కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. 124 మందితో కూడిన పేర్లను విడుదల చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కనకాపుర ప్రాంతం నుంచి బరిలో దిగనున్నారు. వీరితో పాటు పలువురు కీలక నేతల పేర్లను సైతం పార్టీ ప్రకటించింది. మాజీ ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వర కొరటాగెరె (ఎస్సీ) నియోజకవర్గం నుంచి పోటీ పడనున్నారు. మాజీ మంత్రులు కేహెచ్ మునియప్ప దేవనహళ్లిలో తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గేకు సైతం ఈ జాబితాలో చోటు దక్కింది. ప్రియాంక్ ఖర్గే చిటాపుర్ (ఎస్సీ) స్థానం నుంచి బరిలో దిగనున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికీ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అంతకుముందే పార్టీ అభ్యర్థులను ప్రకటించింది హస్తం పార్టీ. ఇంతవరకూ ఆ రాష్ట్రంలో మరే ఇతర పార్టీ.. తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. మార్చి 17నే తొలి జాబితాలోని పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఫైనల్ చేసింది. దిల్లీలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయి.. పేర్లపై చర్చించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి రాహుల్ గాంధీ సహా పార్టీ కీలక నేతలు హాజరయ్యారు.
కర్ణాటక అసెంబ్లీ గడువు మే నెలతో ముగియనుంది. ఆ లోపే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉన్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. 104 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 80, జేడీఎస్ 37 సీట్లు గెలుచుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని నెలకొల్పాయి. అనంతరం ఆ కూటమికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇద్దరు స్వతంత్రులు తమ మద్దతును బీజేపీకి ప్రకటించారు. ఈ పరిణామాల వల్ల కాంగ్రెస్-జేడీఎస్ కూటమి మెజార్టీ కోల్పోయింది. బీఎస్ యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది.
మోదీ కర్ణాటక టూర్
మరోవైపు, బీజేపీ సైతం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కర్ణాటకపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రధాని మోదీ ఏకంగా ఆరు సార్లు కర్ణాటకలో పర్యటన చేశారు. శనివారం మరోసారి రాష్ట్రానికి రానున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర ముగింపు సభలో పాల్గొననున్నారు.
ఆ రిజర్వేషన్లు రద్దు!
ఇదిలా ఉండగా, రిజర్వేషన్లపై కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం మైనారిటీలకు ఉన్న 4 శాతం ప్రత్యేక రిజర్వేషన్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఆ నాలుగు శాతం రిజర్వేషన్లను ఈడబ్ల్యూఎస్‌కు జోడించనుంది. ఇదివరకు ఓబీసీ కేటగిరీలో 2బీ అనే కోటా ఉండేది. దానిలో భాగంగా 4 శాతం రిజర్వేషన్లను ముస్లింలకు కేటాయించారు. ఇప్పుడు వాటిని వొక్కలిగ, లింగాయత్‌లకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వొక్కలిగ, లింగాయత్‌లకు రిజర్వేషన్ల కోసం ఈడబ్ల్యూఎస్‌లో 2సీ, 2డీ కేటగిరీలను గతంలోనే ఏర్పాటు చేశారు. రద్దు చేసిన 4 శాతం మైనారిటీల రిజర్వేషన్లను 2సీ, 2డీలకు సమానంగా పంచనున్నారు. మతపరమైన మైనారిటీలను ఈడబ్ల్యూఎస్ జాబితాలో చేర్చాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.