30 కేసుల్లో నిందితునిగా విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి ఒకరు.. అలాంటి ఎన్నో కేసుల్లో తీర్పులు చెప్పిన జడ్జి మరొకరు.. వీరి మధ్య ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడి కుమారుడు! ఇలా విభిన్న నేపథ్యాలు కలిగిన ముగ్గురు అభ్యర్థులతో రసరవత్తంగా మారింది కర్ణాటక రాజకీయం. కలబురిగి జిల్లాలోని చిత్తాపుర్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ అభ్యర్థులు ఎవరు? వారి నేపథ్యం ఏంటి? తమ విజయావకాశాలపై, ప్రత్యర్థులపై ప్రచారాలపై ఏమంటున్నారు?
ప్రియాంక్ ఖర్గే..
ప్రియాంక్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైన మల్లిఖార్జున ఖర్గే కుమారుడు. గత మూడు పర్యాయాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున.. చిత్తాపుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పోటీ చేసిన మొదటిసారి ఓటమి చవిచూశారు. తరువాత రెండుసార్లు వరుసగా గెలుపొందారు. మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిత్తాపుర్ నియోజకవర్గం నుంచి మూడో సారి కూడా గెలవాలని ప్రియాంక్ ఖర్గే తీవ్రంగా కృషి చేస్తున్నారు.
మణికాంత్ రాఠోడ్..
మణికాంత్ రాఠోడ్ బీజేపీ తరఫున చిత్తాపుర్ నియోజకవర్గం నుంచే బరిలో దిగారు. ఈయన వయస్సు 29 సంవత్సరాలే అయినప్పటికీ.. అనేక క్రిమినల్ కేసుల్లో నిందితునిగా ఉన్నారు. చిత్తాపుర్ నియోజకవర్గంలో ప్రియాంక్ ఖర్గేపై మణికాంత్ను పోటీలో దింపి.. గత లోక్‌సభ ఎన్నికల్లో ఖర్గేను ఓడించినట్లే ఇప్పుడు కుమారుడ్ని ఇంటికి పంపాలన్నది బీజేపీ వ్యూహం. తద్వారా మల్లిఖార్జున ఖర్గే కుటుంబ పలుకుబడిని తగ్గించాలనేది ఆ పార్టీ ఆలోచన.
సుభాష్ చంద్ర రాఠోడ్..
సుభాష్ చంద్ర రాఠోడ్ జనతా దళ్ సెక్యులర్- జేడీఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన గతంలో జడ్జిగా పనిచేశారు. 2022 నవంబర్లో జడ్జిగా రాజీనామా చేశారు. 2023 జనవరిలో జేడీఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం అదే పార్టీ తరఫున.. చిత్తాపుర్ నియోజకవర్గం నుంచి రెండు బలమైన జాతీయ పార్టీల అభ్యర్థులతో పోటీ పడుతున్నారు.
అవన్నీ బూటకపు కేసులే..
ప్రియాంక్ ఖర్గే, సుభాష్ చంద్ర రాఠోడ్కు గట్టి పోటీ ఇస్తున్న మణికాంత్పై ఉన్న క్రిమినల్ కేసులు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. కలబురగి, యాద్గిర్ సహా ఐదు జిల్లాల్లో మణికాంత్పై 30కిపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2022లో ప్రియాంక్ ఖర్గేపై కాల్పులు జరుపుతానని బెదిరించడం వల్ల ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. అయితే.. తనపైన ఉన్న కేసులన్నీ బూటకమేనని.. అవన్నీ రాజకీయ కక్షతోనే పెట్టినవే అన్నది మణికాంత్ రాఠోడ్ వాదన. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటి ద్వారా కర్ణాటకలో అనేక మంది లబ్ధి పొందడం.. తన గెలుపునకు ఉపకరిస్తుందనేది ఆయన ఆశ.
నియోజకవర్గ ప్రజలకు ప్రియాంక్ ఖర్గే అందుబాటులో ఉండరని.. మణికాంత్ ఆరోపిస్తున్నారు. ఆయన చిత్తాపుర్లోని సామాన్యుల సమస్యలు అర్థం చేసుకోలేదని దుయ్యబట్టారు.
ఎన్నికల ప్రచారంలో మణికాంత్ రాఠోడ్ ఎన్నికల ప్రచారంలో మణికాంత్ రాఠోడ్ ప్రజల గొంతుకనవుతా..
సుభాష్ చంద్ర విషయానికి వస్తే.. చిత్తాపుర్లోని తాలుకా కోర్టులో జడ్జిగా పనిచేశారు. ఆ ప్రాంత అభివృద్దే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు. "నేను 2010లో లా ప్రాక్టీస్ చేశాను. లా థియరీకి, రియాలిటీకి చాలా తేడాలు ఉన్నాయి. కర్ణాటకలో చాలా అవినీతి జరుగుతోంది. అన్నా హజారే, సంతోష్ హెగ్డే వంటి సామాజిక కార్యకర్తల సూచనతో.. నేను ఎన్నో సమస్యలపై పోరాడాను. కలబురగి జిల్లాలో రెండేళ్లు జడ్జిగా పనిచేసిన నేను.. ఆ తర్వాత చిత్తాపుర్‌లోనే విధులు నిర్వర్తించాను." అని జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుభాష్ రాఠోడ్ తెలిపారు.
రోడ్లు, రవాణా, విద్య నిరుద్యోగం వంటి సమస్యలు చాలా ఏళ్లుగా చిత్తాపుర్లో నియోజకవర్గంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని సుభాష్ రాఠోడ్ ఆరోపించారు. మౌనంగా ఉన్న ప్రజల గొంతుకను అవుదామనే లక్ష్యంతోనే తాను జడ్జిగా రాజీనామా చేసి.. ఎన్నికల బరిలో దిగినట్లు సుభాష్ చెప్పారు.
రౌడీ షీటర్ను పోటీలో దింపి.. ప్రజల్ని అవమానపరుస్తున్నారు..
కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న ప్రియాంక్ ఖర్గే.. బీజేపీ అభ్యర్థి మణికాంత్ రాఠోడ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బీజేపీ ఓ 'హిస్టరీ షీటర్'ను చిత్తాపుర్ నుంచి బరిలోకి దింపి.. ప్రజలను కించపరుస్తోందని విమర్శలు గుప్పించారు.
"చిత్తాపుర్ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపిస్తారని చాలా నమ్మకంగా ఉన్నాను. నేను చేసిన అభివృద్ది పనులపై ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. నేను నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాను. బీజేపీ అభ్యర్థిపై 40 కేసులున్నాయి. అలాంటి వ్యక్తిని బీజేపీ ఎన్నికల్లో నిలిపింది." అని ప్రియాంక్ విమర్శించారు. తాము ఎప్పుడూ అభివృద్ది రాజకీయాలు మాత్రమే నమ్ముతామని.. విభజన రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారంలో ప్రియాంక్ ఖర్గే ఎన్నికల ప్రచారంలో ప్రియాంక్ ఖర్గే