Karnataka Election 2023 Results : 2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన ఆ అభ్యర్థి.. 2023 ఎన్నికల్లో మాత్రం 59వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థిపై భారీ విజయం సాధించారు. చామరాజనగర జిల్లాలోని కొల్లేగల అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన ఏఆర్ కృష్ణమూర్తి.. సమీప ప్రత్యర్థి ఎన్ మహేశ్‌పై విజయ ఢంకా మోగించారు. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో అనేక సార్లు ఓటమి చవిచూసిన కృష్ణమూర్తి.. ఈ సారి సిట్టింగ్ ఎమ్మెల్యేపై సునాయసంగా గెలిచారు.
తాజాగా జరిగిన ఎన్నికల్లో ఏఆర్ కృష్ణమూర్తికి మొత్తం 1,08,363 ఓట్లు వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ మహేశ్.. 48,844 ఓట్లను మాత్రమే పొందారు. జేడీఎస్ తరఫున పోటీ చేసిన బి పుట్టస్వామి జాతీయ పార్టీలకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఆయన కేవలం 3,925 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. 2018 ఎన్నికల్లో ఎన్ మహేశ్ బీఎస్పీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం కుమార స్వామి కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత వివిధ కారణాల రీత్యా 2021లో బీజేపీలో చేరారు. జేడీఎస్ నుంచి బరిలోకి దిగిన పుట్టస్వామి.. పోలీసు ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు.