Karnataka Assembly Election Results : కర్ణాటక ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. 224 స్థానాలు ఉన్న కర్ణాటకలో 135 స్థానాల్లో.. హస్తం పార్టీ జయభేరి మోగించింది. మళ్లీ అధికారంలోకి వస్తామని భావించిన భారతీయ జనతా పార్టీ 66 స్థానాల్లో మాత్రమే గెలిచింది. జేడీఎస్ 19 స్థానాలకే పరిమితంకాగా.. ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన సర్వోదయ కర్ణాటక పక్ష ఒక స్థానంలో విజయం సాధించింది. ఈ విజయంతో 2013 తర్వాత స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. బెంగళూరు, కోస్టల్ కర్ణాటకల్లో మాత్రమే.. కాస్త మెరుగైన ప్రదర్శనను కనబరిచిన భాజపా ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది.
మొత్తం స్థానాలు | 224 |
కాంగ్రెస్ | 135 |
బీజేపీ | 66 |
జేడీఎస్ | 19 |
ఇతరులు | 4 |
ప్రాంతాల వారీగా..
- సెంట్రల్ కర్ణాటకలో 25 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 19 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. భాజపా 5, జేడీఎస్ ఒక చోట గెలిచాయి.
- కల్యాణ కర్ణాటక ప్రాంతంలోని 41 స్థానాల్లో కాంగ్రెస్ 26 స్థానాలను హస్తగతం చేసుకుంది. భాజపా 10 స్థానాల్లో మాత్రమే గెలిచింది. జేడీఎస్ 3, ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు.
- కిట్టూరు కర్ణాటక ప్రాంతంలోని 50 స్థానాల్లో 33 కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. భాజపా 16 నియోజకవర్గాల్లో గెలిచింది. జేడీఎస్ ఒక చోట విజయం సాధించింది.
- పాత మైసూరు ప్రాంతంలో 61 స్థానాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, జేడీఎస్ మధ్యే నడిచింది. భాజపా నామమాత్రంగానే ఉనికిని చాటింది. కాంగ్రెస్ 39 చోట్ల జయభేరి మోగించింది. కంచుకోట అయిన మైసూరులో జేడీఎస్ 14 స్థానాలకే పరిమితమైంది. భాజపా 6 చోట్ల గెలవగా..ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు.
- పట్టణ, కోస్తా ప్రాంతాల్లో మాత్రమే కమళదలం.. తన పట్టునిలుపుకోగలిగింది. బెంగళూరు రీజియన్‌లో 28అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 15 స్థానాల్లో కమలదళం గెలిచింది. భాజపాకు గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ 13 స్థానాలను కైవసం చేసుకుంది.
- కోస్టల్ కర్ణాటకలో కమలదళం సత్తా చాటింది. మొత్తం 19 స్థానాల్లో 13 తమ ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ ఆరు చోట్ల విజయం సాధించింది. జేడీఎస్ ఊసే లేకుండా పోయింది.