Karnataka Assembly Election 2023 : త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. పట్టభద్రులకు నెలకు రూ. 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. డిప్లొమా చదివిన విద్యార్థులకు నెలకు రూ.1,500 చొప్పున రెండేళ్లపాటు అందిస్తామని తెలిపారు. కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ ర్యాలీలో రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి పాల్గొన్నారు. మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా పోరాడాలని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. దేశంలో అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వం కర్ణాటకలోని బీజేపీ సర్కారేనని విమర్శించారు. బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం 40 శాతం కమీషన్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.
అంతకుముందే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అనేక హామీలను కాంగ్రెస్ ప్రకటించింది. గృహలక్ష్మి అనే పథకం కింద రాష్ట్రంలోని ప్రతి గృహిణికి నెలకు రూ. 2,000 చొప్పున భృతి ఇస్తామని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ ప్రకటించారు. దీని ద్వారా సుమారు కోటిన్నర మంది గృహిణులు లబ్ధి పొందుతారని చెప్పారు. ఏడాదికి రూ. 24,000 నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమా అవుతుందని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సహా అన్న భాగ్య కింద కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది.