Karnataka assembly election 2023 : కర్ణాటకలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు వినూత్న మేనిఫెస్టోను ప్రకటించారు. పెళ్లి కాని యువతకు వివాహాలు జరిపిస్తామనే హామీని ఓటర్ల ముందు ఉంచారు. తమను గెలిపిస్తే.. యువతకు పెళ్లిళ్ల పథకం-2023 అమలు చేసి కచ్చితంగా వివాహాలు జరిపిస్తామని విన్నవించారు. ప్రధాన రాజకీయ పార్టీలు పోటాపోటీ హామీల వర్షం కురిపిస్తున్న వేళ.. ఆ ఇద్దరు ఇండిపెండెట్లు ప్రత్యేక హామీలతో ప్రజల్ని ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నారు.
గురుపుత్ర కెంపన్న కుల్లూరు, పుండలీక కుల్లూరు అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ వినూత్న హామీని ఓటర్ల ముందు ఉంచారు. కర్ణాటకలోని ఆరభావి, గోకాక్ అనే అసెంబ్లీ స్థానాల నుంచి వీరు పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన వీరిద్దరు.. మరికొన్ని ప్రత్యేక హమీలను సైతం ప్రకటించారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులు గురుపుత్ర, పుండలీక మేనిఫెస్టోలోని అంశాలు ఇలా..
- యువతకు పెళ్లిళ్ల పథకం-2023
- శ్రీ శక్తి స్వయం సహాయక సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ
- ప్రతి ఒక్కరి ఖాతాలో 31,600 రూపాయల జమ
- రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయడం
- నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం
- ఇళ్లు లేని వారికి మూడు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం
- యువత స్వయం ఉపాధి కోసం ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు సబ్సిడీ రుణాలు
- దీంతో పాటు మరిన్ని హామీలు సైతం ప్రకటించారు.
కర్ణాటక బీజేపీ మేనిఫెస్టో..
Karnataka BJP Manifesto 2023 : ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ఇదివరకే మేనిఫెస్టోలను ప్రకటించాయి. మరోసారి అధికారంలోకి వస్తే కర్ణాటకలో ఉమ్మడి పౌరస్మృతి, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా రోజూ అరలీటర్ నందిని పాలు, నెలవారీ రేషన్ సరుకులతో 5 కిలోల సిరిధాన్యాలు ఇచ్చే పథకాన్ని బీజేపీ తన మేనిఫేస్టోలో చేర్చింది. తయారీ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు, కర్ణాటక అపార్ట్‌మెంట్ యాజమాన్య చట్టం-1972 సవరణలకు ఓ కమిటీతో పాటు ఇతర హామీలను ప్రకటించింది.
కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో..
Karnataka Congress Manifesto 2023 : కాంగ్రెస్ పార్టీ కూడా కన్నడిగులపై వరాల జల్లు కురిపించింది. అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్, పీఎఫ్‌ఐ సంస్థలపై నిషేధం, కాంట్రాక్టర్లకు గడువులోగా బిల్లులు చెల్లింపు హామీ, పోలీసులకు నైట్ డ్యూటీ అలవెన్సులు, మహిళలకు రూ.2వేల సాయం, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి మైనారిటీలకు రిజర్వేషన్ల పునరుద్ధరణ వంటి హామీలతో పాటు ఇతర హామీలను కూడా ఇచ్చింది. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచితంగా కరెంటు, ప్రతి కుటుంబానికి 10 కిలోల ఉచితం బియ్యం ఇందులో ఉన్నాయి. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మే 10న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది.