తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కౌంటింగ్​కు రంగం సిద్ధం.. కన్నడనాట గెలుపెవరిది? ఎగ్జిట్​ పోల్స్​ నిజమవుతాయా? - కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జేడీఎ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మరి కన్నడ ప్రజలు మార్పు సంప్రదాయానికి జై కొట్టారా? లేక సెంటిమంట్​ను బ్రేక్​ చేశారా? అన్నది శనివారమే తెలియనుంది.

Karnataka Assembly Election 2023 Counting
Karnataka Assembly Election 2023 Counting

By

Published : May 12, 2023, 1:16 PM IST

Karnataka Assembly Election 2023 Counting : దేశంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు స్థానిక పార్టీలు సైతం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న క‌ర్ణాట‌క ఎన్నిక‌ల కౌంటింగ్​కు సర్వం సిద్ధమైంది. కన్నడ ప్రజలు మన్ననలు ఎవరికి దక్కాయో శనివారమే తేలనుంది. అయితే సంప్రదాయం ప్రకారం కర్ణాటక అధికారం చేతులు మారుతుందా? లేదా చరిత్ర సృష్టిస్తూ బీజేపీనే అధికారంలో కొనసాగుతుందా? లేదా ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు నిజమవుతాయా? వీటిన్నంటికి సమాధానాలు మరికొద్ది గంటల్లో తెలియనుంది!

శనివారం మధ్యాహ్నం నాటికి..
రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రారంభం కానుంది. మొత్తం 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు​ జరగనుంది. మధ్యాహ్నం నాటికి కన్నడ నాట ఫలితం.. స్పష్టంగా వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్​ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. భారీగా బలగాలను మోహరించినట్లు వెల్లడించారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ ఏం చెబుతున్నాయి?
Karnataka Exit Poll 2023 : సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన రాజకీయ పార్టీలు.. అదే స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించాయి. నాలుగైదు చోట్ల మినహా మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 2615 మంది అభ్యర్థులు పోటీ చేసిన ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73.19 ఓటింగ్​ శాతం నమోదైంది. కర్ణాటకలో గెలుపెవరిదనే విషయంపై పలు సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే..

అయితే కర్ణాటకలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చే అవకాశాలు లేవని.. మెజార్టీ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉందని చెప్పాయి. జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్‌గా నిలిచే అవకాశముందని అంచనా కట్టాయి.

ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు

మళ్లీ హంగ్‌ తప్పదా?
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలున్నాయి. తాజాగా వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌.. కాంగ్రెస్‌ పార్టీ ఈసారి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా వేశాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 సీట్లు వచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. దీంతో కన్నడనాట మళ్లీ హంగ్‌ తప్పకపోవచ్చనే పరిస్థితి కనిపిస్తోంది. జేడీఎస్‌కు 20 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతుండటం వల్ల ఎప్పటిలానే దేవెగౌడ పార్టీ కింగ్‌ మేకర్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2018లో ఇలా..
2018 ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ 80, జేడీఎస్‌ 37 స్థానాల్లో గెలుపొందాయి. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం వల్ల ప్రభుత్వ ఏర్పాటు సమయంలో నాటకీయ పరిణామాలు నెలకొన్నాయి. తొలుత యడియూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన్పటికీ.. మూడు రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. హెచ్‌డీ కుమారస్వామి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.

కానీ ఆ సంకీర్ణ ప్రభుత్వం 14 నెలలు మాత్రమే కొనసాగింది. అనంతరం కొంతమంది ఎమ్మెల్యేలు కమలం పార్టీలో చేరడం వల్ల పరిణామాలు మారిపోయాయి. కాషాయ పార్టీ బలం 116కు చేరుకోవడం వల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇలా గడిచిన 38 ఏళ్లుగా కర్ణాటకలో ఏ ఒక్క పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. దీన్ని అధిగమించేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేసినప్పటికీ ఈసారి కూడా అదే తీరు కనిపిస్తోంది.

అప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పినట్లే!
2018లో ఎన్నికలు ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే తుది ఫలితం వెలువడింది. పలు జాతీయ వార్తా సంస్థలతోపాటు ఒక ప్రాంతీయ ఛానల్‌ కూడా బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే అన్ని సర్వేలు కూడా హంగ్‌ అసెంబ్లీ వస్తుందనే చెప్పాయి. ఫలితం కూడా అలాగే వచ్చింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌ అవుతుందని చెప్పాయి. 20 నుంచి 40 స్థానాల్లో గెలుస్తుందని చెప్పినట్లే ఆ పార్టీ 37 స్థానాల్లో విజయం సాధించింది. కింగ్‌ మేకర్‌గా అవతరించింది.

ABOUT THE AUTHOR

...view details