తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. CM అభ్యర్థిపై బీజేపీ, కాంగ్రెస్ మౌనం.. ఏం జరుగుతుంది? - కర్ణాటక కాంగ్రెస్ నాయకులు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు కావడం వల్ల ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే సీఎం అభ్యర్థి ఎవరనే అంశంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మౌనం పాటిస్తున్నాయి. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఇరు పార్టీలు ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

karnataka-assembly-election-2023-karnataka-election-prediction
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023

By

Published : Mar 31, 2023, 6:33 AM IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టోలపై కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పేరును ముందస్తుగా ప్రకటించే విషయంలో మాత్రం రెండు పార్టీలు మౌనం పాటిస్తున్నాయి. కర్ణాటక సీఎంగా బసవరాజ్‌ బొమ్మై ఉన్నప్పటికీ బీజేపీ ప్రచార సారధిగా యడియూరప్పదే కీలక పాత్ర. తనకు 80ఏళ్లు పైబడినందున ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని యడ్డీ ఇప్పటికే స్పష్టం చేశారు.

ఆయన సుమారు ఐదు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కర్ణాటకలో బీజేపీను అధికారంలోకి తీసుకువచ్చే స్థాయికి చేర్చడంలో యడియూరప్పది కీలక పాత్ర. ఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన రాజకీయాలకు దూరం అయినట్లు కాదని యడియూరప్ప చెబుతున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ఎవరిని ప్రతిపాదించి ఎన్నికలకు వెళ్తుందనే విషయం ఆసక్తిగా మారింది.

కర్ణాటకలో లింగాయత్‌ వర్గంలో గట్టి పట్టున్న నేతగా యడియూరప్పకు పేరుంది. యడ్డీతో పోలిస్తే ముఖ్యమంత్రి బొమ్మైకి.. వారిని ఆకట్టుకునే చరిష్మా లేదనే అభిప్రాయం ఉంది. బీజేపీకి లింగాయత్‌ వర్గం మద్దతు లభించాలంటే మాత్రం యడ్డీని ప్రచారంలో ముందుంచాల్సిందే. మరోవైపు వొక్కళిగ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మద్దతూ బీజేపీకి అవసరం. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థి పేరును కమలదళం ప్రకటించకపోవచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ విజయం సాధిస్తే బొమ్మైనే మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరోవైపు.. కాంగ్రెస్‌లో మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వంటి సీనియర్లు సీఎం రేసులో ఉన్నారు. ఇతర పార్టీలతో పోలిస్తే కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం ఆశావహుల సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే సీఎం రేసులో ఉన్నట్లు ప్రకటనలు చేస్తుండగా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌తోపాటు జి.పరమేశ్వర వంటి సీనియర్లు కూడా సీఎం అభ్యర్థిత్వం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇదే విషయంపై శివకుమార్‌, పరమేశ్వరలు గతంలో పలు సందర్భాల్లో సీఎం అభ్యర్థిత్వంపై తమ మనసులో మాటను బయటపెట్టారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయం కాంగ్రెస్‌ ఎప్పుడూ ప్రకటించదని సిద్ధరామయ్య చెబుతున్నారు. పార్టీలో సీఎం ఆశావహుల్లో తాను ఒకడినని స్పష్టం చేశారు. ఇతర నేతలకు కూడా ఆసక్తి ఉన్నమాట వాస్తవమేనని.. అందులో తప్పేమీ లేదన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు వెళ్లే పరిస్థితి రెండు పార్టీల్లోనూ కనిపించడం లేదని తెలుస్తోంది. దీనిపై ఆయా పార్టీల అగ్రనాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.

ABOUT THE AUTHOR

...view details