కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్.. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు. కమలదళంలో చేరతారని తొలుత వార్తలు వచ్చినా.. ఆయన బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడం వరకే పరిమితమయ్యారు. బెంగళూరులో బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కిచ్చా సుదీప్ కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈ విషయం ప్రకటించారు. "బసవరాజ్ బొమ్మై నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నా మద్దతు ఆయనకే. కష్టకాలంలో నాకు అండగా నిలిచిన వారి తరఫున నేను పని చేస్తా. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు" అని స్పష్టం చేశారు సుదీప్.
"సుదీప్.. ఏ రాజకీయ పార్టీకి చెందరు. ఆయన నాకు మద్దతు పలికారు. నాకు మద్దతు ఇస్తున్నారంటే.. బీజేపీకి కూడా ఆయన మద్దతు ఇస్తున్నట్లే" అని సీఎం బసవరాజ్ బొమ్మై చెప్పారు.
మరోవైపు.. కన్నడ చిత్ర సీమకు చెందిన మరో ప్రముఖ నటుడు దర్శన్ కూడా బీజేపీలో చేరతారని జోరుగా వార్తలు వినిపించాయి. సుదీప్, దర్శన్ మద్దతు కోసం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్ సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
'ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తాం'
అంతకుముందు.. సుదీప్ బీజేపీలో చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన మేనేజర్ జాక్ మంజుకు బెదిరింపు లేఖ అందింది. అందులో సుదీప్ ప్రైవేట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని దుండగులు బెదిరించారు. దీంతో మేనేజర్ వెంటనే పుట్టెనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.