తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హనుమాన్ భక్తులను జైల్లో పెడతారా?'.. మోదీ ఫైర్.. క్షమాపణకు కాంగ్రెస్ డిమాండ్ - karnataka assembly election

బజరంగ్ దళ్ సంస్థను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం.. కర్ణాటకలో రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో రాముడిని జైల్లో పెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు బజరంగ్ బలి అని నినదించేవారిని జైల్లో పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. అయితే, హనుమంతుడిని.. బజరంగ్ దళ్​తో పోల్చడం కోట్లాది మంది భక్తులకు అవమానకరమని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

CONG PM BAJRANG DAL
CONG PM BAJRANG DAL

By

Published : May 2, 2023, 7:31 PM IST

కాంగ్రెస్‌ పార్టీ బజ్‌రంగ్‌ బలిని జైల్లో బంధించాలని చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా హోస్పేట బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని.. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికే లక్ష్యంగా ఎదురుదాడి చేశారు. బజరంగ్ దళ్ సంస్థను నిషేధిస్తామని కాంగ్రెస్ ప్రకటించడంపై మండిపడ్డారు. గతంలో రాముడంటే ఇష్టపడని కాంగ్రెస్‌.. ఇప్పుడు బజ్‌రంగ్‌ బలిని కూడా ఇష్టపడటంలేదని విమర్శించారు. తమ ఎన్నికల ప్రణాళికలో కర్ణాటకను నంబర్‌ వన్‌ చేసే రోడ్‌ మ్యాప్‌ను ప్రకటిస్తే.. కాంగ్రెస్ పార్టీ బజ్‌రంగ్‌బలి అని నినదించే వారిని జైల్లో పెట్టాలని చూస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.

"హనుమాన్‌ పవిత్ర భూమికి వందనం చేయటం ఎంతో సౌభాగ్యంగా భావిస్తున్నా. నేను హనుమాన్ పవిత్ర భూమికి వందనం చేయటానికి వస్తే అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో బజ్‌రంగ్‌బలిని జైల్లో బంధించాలని నిర్ణయం తీసుకుంది. తొలుత రాముడ్ని జైల్లో బంధించింది. ఇప్పుడు జై బజ్‌రంగ్‌బలి అనే వారిని జైల్లో పెట్టాలని నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్​కు రాముడి విషయంలో ఏదో సమస్య ఉన్నట్లు ఉంది. ఇది దేశానికి దురదృష్టకరం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఇతర బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్​ మేనిఫెస్టోపై తీవ్రంగా స్పందించారు. హనుమంతుడిని కాంగ్రెస్ అవమానిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి గట్టిగా బదులిస్తారని బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర చెప్పుకొచ్చారు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)ను కాపాడేందుకే బజరంగ్ దళ్​పై నిషేధం అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. 'బుజ్జగింపు రాజకీయాలకు పరాకాష్ట ఇది. హనుమంతుడిని అవమానించి పీఎఫ్ఐని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నమిది. హనుమంతుడు కర్ణాటక గౌరవశాలి. కర్ణాటక హనుమంతుడి గడ్డ. అలాంటి హనుమంతుడిని కాంగ్రెస్ అవమానించింది' అంటూ మండిపడ్డారు సంబిత్ పాత్ర.

'మోదీ క్షమాపణ చెప్పాలి'
అయితే, హనుమంతుడిని బజరంగ్ దళ్​తో పోల్చి భక్తుల మనోభావాలను ప్రధాని మోదీ దెబ్బతీశారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఇందుకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఆంజనేయస్వామిని.. బజరంగ్ దళ్​తో పోల్చడం కోట్లాది మంది భక్తులకు అవమానకరమని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేడా అన్నారు. హనుమంతుడిని అవమానించే హక్కు ప్రధానికి ఎవరూ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.

'అవినీతిపై మాట్లాడరేం?'
మరోవైపు, కర్ణాటక ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటకలో జరుగుతున్న అవినీతిపై ప్రధాన మంత్రి ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. శివమొగ్గలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన రాహుల్‌ గాంధీ.. బసవరాజ్‌ బొమ్మై ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయినా.. మోదీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. 3 ఏళ్ల క్రితం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి భాజపా అధికారాన్ని లాక్కుందని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. భాజపా నేతలు ప్రతి పనిలో 40శాతం కమీషన్లు అడుగుతున్నారని, కర్ణాటక కాంట్రాక్టర్ల అసోసియేషన్ లేఖ రాసినా ప్రధాన మంత్రి మోదీ ఇప్పటికీ స్పందించలేదని అన్నారు.

సినీ నటుడి ప్రచారం
చిత్రదుర్గలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ర్యాలీలో ప్రముఖ నటుడు శివరాజ్​కుమార్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ అభిమానిగా ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఇటీవల భారత్ జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా రాహుల్ పర్యటించారని గుర్తు చేశారు. ఆ యాత్ర ద్వారా తాను బాగా స్ఫూర్తి పొందినట్లు చెప్పారు. శివరాజ్​కుమార్ భార్య గీతా శివరాజ్​కుమార్ ఇటీవలే కాంగ్రెస్​లో చేరారు.

'మాటలు జాగ్రత్త!'
కర్ణాటక ఎన్నికల్లో రాజకీయ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. అన్ని పార్టీలు సంయమనం వహించాలని కోరింది. ఈ మేరకు స్టార్ క్యాంపెయినర్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అడ్వైజరీ జారీ చేసింది. ప్రచార ప్రసంగాల విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details